● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: సెక్షన్ 22ఏ పరిధిలోని భూములకు సంబంధించి మండల, గ్రామాల వారీగా సమగ్రంగా పరిశీలించి వాస్తవమైన, ఖచ్చితమైన డేటాను సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో భూముల రీ–సర్వే, భూ భారతి, సాదా బైనామా, రెవెన్యూ సదస్సు దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను సెక్టార్, గ్రామాల వారీగా ప్రత్యేక ప్రొఫార్మాలో సిద్ధం చేయాలని సూచించారు. డిసెంబర్ 2025 నాటికి సెక్షన్ 22ఏ కింద ఉన్న 1ఏ, 1బీ, 1సీ, 1డీ తదితర కేటగిరీల భూముల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, 2016, 2021 సంవత్సరాల్లో సిద్ధం చేసిన డేటాతో సరిపోల్చాలని తెలిపారు. మండల, గ్రామాల వారీగా భూముల విస్తీర్ణంలో వ్యత్యాసాలు ఉన్నట్లయితే వాటికి గల కారణాలను గుర్తించి, అవసరమైన సవరణలు చేపట్టాలని ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న పాత డేటాను సేకరించి, ప్రస్తుత వివరాలతో పోల్చి పూర్తిస్థాయి నివేదికలను సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పటివరకు పూర్తికాని ల్యాండ్ రికార్డుల సవరణలు, ప్రతిపాదనలు, నివేదికల తయారీ పనులను వెంటనే ప్రారంభించి పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
ఫారెస్ట్, ప్రాజెక్టులు, సింగరేణి భూములపై ప్రత్యేక దృష్టి
ఫారెస్ట్ భూములు, సాగునీటి ప్రాజెక్టులు, సింగరేణి భూములకు సంబంధించి భూముల వాస్తవ స్వభావాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. ల్యాండ్ అక్విజిషన్‌యాక్ట్, అవార్డుల వివరాలను పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ, వ్యవసాయేతర కేటగిరీలను నిబంధనల ప్రకారం నిర్ధారించాలని తెలిపారు. రీ–సర్వే పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రీ–సర్వేకు సంబంధించిన శిక్షణ పొందిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు, జీపీఓలను సమన్వయం చేసుకుంటూ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. భూ సర్వే పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని, ప్రతీ వారం భూసర్వే పనులపై సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. 22ఏ భూముల డేటాలో తప్పులు, వ్యత్యాసాలు లేకుండా వాస్తవ వివరాలను సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టంచేశారు. నిర్ణీత గడువులోగా అన్ని మండలాల అధికారులు సమన్వయంతో పూర్తి వివరాలతో కూడిన నివేదికలను కలెక్టర్ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.


