మల్హర్: ఓ సింగరేణి ఉద్యోగి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మల్హర్ మండలం కొయ్యూరు పీవీనగర్ సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన కృష్ణచైతన్య (32) పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆజీ–3 ఏరియాలోని అడ్రియాల ప్రాజెక్టు ఏఎల్‌పీ మైన్‌లో ఓర్మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సెంటినరీ కాలనీలోని సింగరేణి క్వార్టర్‌లో నివాసం ఉంటున్నాడు. కల్వచర్లలో ఓ ప్రైవేట్ పాఠశాల నడిపిస్తున్నాడు. మంగళవారం ఉదయం బైక్‌పై ఇంటినుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రమైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య పద్మావతి పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. అనుమానం వచ్చి బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా కొయ్యూరు పీవీనగర్ సమీపంలో బైక్ పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి కావడంతో సెల్ సిగ్నల్ ఆధారంగా లొకేషన్ గుర్తించి వెళ్లగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు గుర్తించారు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


