సద్వినియోగం చేసుకోవాలి.. | - | Sakshi
Sakshi News home page

సద్వినియోగం చేసుకోవాలి..

Aug 31 2026 1:14 AM | Updated on Aug 31 2026 1:14 AM

సద్వినియోగం చేసుకోవాలి..

జిల్లాలోని విద్యార్థులు విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ను సద్వినియోగం చేసుకోవాలి. ఈ పరీక్ష ద్వారా వారిలో దాగి ఉన్న సామర్థ్యం బయటకు వస్తుంది. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో పాల్గొనడం ద్వారా భవిష్యత్‌లో కూడా ఇటువంటి పరీక్షలపై భయం పోతుంది. ఈ పరీక్షకు సంబంధించిన పుస్తకాలు కూడా వెబ్‌సైట్‌లో ఉందుబాటులో ఉంటాయి. ప్రతిభ కనబర్చిన వారికి నగదు ప్రోత్సాహకాలు ఉంటాయి. ప్రతీ నెల స్కాలర్‌షిప్‌ అవకాశం ఉంటుంది.

– బర్ల స్వామి, జిల్లా సైన్స్‌ అధికారి

భూపాలపల్లి అర్బన్‌: విద్యార్థుల మెదడుకు పదును పెట్టి భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌(వీవీఎం)–2026–27 పేరిట జాతీయ స్థాయి సైన్స్‌ ప్రతిభా పరీక్షను ఏటా దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిభ చూపిన వారికి ఉపకార వేతనాలు ఇస్తోంది. ఆన్‌లైన్‌ పరీక్షకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో 6–10 తరగతి, జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులు అర్హులు. జిల్లాలో 414 ప్రభుత్వ పాఠశాలలు, 6 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి.

పరీక్ష నిర్వహణ ఇలా..

పాఠశాల నుంచి పాల్గొనే 6–9 తరగతి విద్యార్థులను జూనియర్లుగా, పదో తరగతి, ఇంటర్‌ విద్యార్థులను సీనియర్లుగా పరిగణిస్తారు. విద్యార్థులు తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తోపాటు ఇతర మాధ్యమాల్లో పరీక్ష రాయవచ్చు. 90 నిమిషాల్లో 100 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. గణితం, భౌతిక, రసాయన, జీవశాస్త్రాల నుంచి 50శాతం, భారతదేశం కృషిపై 20శాతం, శాస్త్రవేత్తల పరిశోధనలపై 20శాతం, లాజికల్‌ రీజనింగ్‌పై 10శాతం ప్రశ్నలు ఉంటాయి. జూనియర్‌ కేటగిరీ విద్యార్థులు అక్టోబరు 28నుంచి నవంబరు 2వరకు, సీనియర్‌ కేటగిరిలో నవంబర్‌ 19–23 వరకు వారి తరగతిని బట్టి వారికి నచ్చిన తేదీల్లో ఆన్‌లైన్‌లో పరీక్ష రాయవచ్చు. 2026 జనవరి 4న రాష్ట్ర స్థాయిలో, 30న జాతీయస్థాయిలో పోటీలు ఉంటాయి.

ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు

పాఠశాల స్థాయిలో 18 మంది చొప్పున, జిల్లా స్థాయిలో సబ్జెక్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పాల్గొనే వారందరికీ ధ్రువపత్రాలు అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభచూపిన తొలి ముగ్గురికి రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేలు బహుమతిగా అందజేస్తారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురు విద్యార్థులకు రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు అందజేస్తారు. దేశంలోని పరిశోధన, అభివృద్ధి సంస్థలైన ఇస్రో, డీఆర్‌డీఓ, సీఎస్‌ఐఆర్‌, బీఏఆర్‌సీ వంటివి సందర్శించే అవకాశంతో పాటు సంస్థల శాస్త్రవేత్తలతో నేరుగా సంభాషించడం, శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. ఏడాది పాటు నెలకు రూ.2వేల చొప్పున స్కాలర్‌షిప్‌ అందిస్తారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

విజ్ఞాన్‌ మంథన్‌ దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరిస్తున్నారు. అర్హులైన వారు పోటీల్లో పాల్గొనేందుకు సెప్టెంబర్‌ 30లోగా www.vvm.orf.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. యూజర్‌ ఐడీ పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అయ్యి వివరాలు నమోదుచేయాలి. పరీక్ష రుసుం రూ.200. వచ్చే నెల మొదటి వారం నుంచి వెబ్‌సైట్‌లో పుస్తకాలు అందుబాటులో ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement