రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Aug 31 2026 1:14 AM | Updated on Aug 31 2026 1:14 AM

మల్హర్‌: రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. ఆదివారం మల్హర్‌ మండలం కొయ్యూరులో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఐదు మండలాలకు కేంద్రంగా కాటారంలో మాత్రమే మరమ్మతు కేంద్రం ఉండేదని, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులో జాప్యం జరగడంతో రైతులకు సకాలంలో సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిని గుర్తించి కొయ్యూరులో మరో మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్‌ ఇస్తున్నామని, అదేవిధంగా నాగులమ్మ నుంచి తాడిచర్ల వరకు, తాడిచర్ల నుంచి ఖమ్మంపల్లి బ్రిడ్జి వరకు రోడ్డు నిర్మాణానికి హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ స్కీం కింద నిధులు మంజూరు చేశామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మల్లారం క్రాస్‌ రోడ్‌ నుంచి పెద్దతూండ్ల వరకు, పెద్దతూండ్ల నుంచి చిన్నతుండ్ల వయా మల్లారం వరకు రోడ్డు నిర్మాణానికి కూడా నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జెన్‌కో ఓపెన్‌ కాస్ట్‌ డేంజర్‌ జోన్‌ 500 మీటర్ల పరిధిలో ఉన్న తాడిచర్ల భూ నిర్వాసితులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం కొయ్యూరులో ఏర్పాటు చేసిన నయారా పెట్రోల్‌ పంపును ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అయిత ప్రకాశ్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్‌, ఈజీఎస్‌ చైర్మన్‌ దండు రమేశ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి అయిత రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ కోట రాజబాబు, తాడిచర్ల సింగిల్‌ విండో చైర్మన్‌ ఇప్ప మొండయ్య, స్థానిక సర్పంచ్‌ కొండ రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

శ్రీధర్‌బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement