● డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
తిరుపతి
భూపాలపల్లి అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నాయని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన డీవైఎఫ్‌ఐ జిల్లా నాలుగో మహాసభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు యువతకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తుండటంతో ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేసే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని ప్రభుత్వం అమలు చేయడం లేదని, జాబ్ క్యాలెండర్ విడుదలలోనూ అలసత్వం ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేసి ప్రైవేట్ వైద్య వ్యాపారాన్ని అరికట్టాలని, కోల్‌మైన్స్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. యువత సమస్యల పరిష్కారం కోసం డీవైఎఫ్‌ఐ నిరంతరం పోరాడుతోందని తెలిపారు. ఈ మహాసభలో డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి భూక్యా నవీన్‌నాయక్, జిల్లా గర్ల్స్ కన్వీనర్ అంబాల స్వర్ణలత, నాయకులు తోట జ్ఞానేశ్వరి, రవికుమార్, శంకర్ పాల్గొన్నారు.


