వద్దన్నా.. వరిసాగే! | - | Sakshi
Sakshi News home page

వద్దన్నా.. వరిసాగే!

Aug 30 2026 1:03 AM | Updated on Aug 30 2026 1:03 AM

ఆరుతడి పంటలకు అనుగుణంగా లేవు..

జిల్లాలో 97,619 ఎకరాల్లో సాగు

ఎల్‌నినో ప్రచారాన్ని పట్టించుకోని రైతులు

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడవని అధికారులు చెబుతున్నారు. మా భూములు ఆరుతడి పంటలకు అనుగుణంగా లేవు. ఇటీవల కురిసిన వర్షాలకు 6 ఎకరాల్లో వరి సాగు చేశా.

– మామిండ్ల శివ, రైతు, టేకుమట్ల

భూపాలపల్లి రూరల్‌: జిల్లాలో ఎల్‌నినో ప్రభావాన్ని లెక్క చేయకుండా రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. వర్షాభావ పరిస్థితులు, చెరువుల్లో పరిమిత నీటి లభ్యత, భూగర్భ జలాల తగ్గుదల.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్దేశించింది. గతేడాది 1.14 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈ ఏడాది ఆరుతడి పంటల సాగు కోసం ప్రచార కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించింది. అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. జిల్లాలో ఇప్పటివరకు 97,619 ఎకరాల్లో వరి నాట్లు వేయగా కంది, పెసర, జొన్న, పసుపు, తదితర పంటలు కేవలం 16,498 ఎకరాల్లోనే సాగయ్యాయి. ఆరుతడి పంటల సాగు లక్ష్యం కాగితాలకే పరిమితమైంది. వ్యవసాయ శాఖ అంచనాకు మించి జిల్లాలో రైతులు వరి సాగు చేశారు.

నీటి వినియోగం తగ్గించాలని..

నీటి వినియోగాన్ని తగ్గించేందుకు ఆరుతడి పంటల వైపు రైతులను మళ్లించాలని అధికారులు సూచిస్తున్నారు. వరి సాగుకు అధికంగా నీరు అవసరమవుతుండటంతో వీలైనంత మేర ఇతర పంటలను సాగు చేయాలని చెబుతున్నారు. అయితే వరికి మార్కెట్‌ ఉండటం, సాగు పద్ధతిపై అనుభవం ఉండటం, గతంలో మంచి దిగుబడులు రావడం తదితర కారణాలతో అన్నదాతలు వరి సాగుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గతేడాది వానాకాలంలో జిల్లాలో 1.14లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, ప్రస్తుత 97,619 ఎకరాల్లో వరి సాగైంది. పత్తి పెద్ద ఎత్తున 1,09,442 ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఇప్పటివరకు 2,23,554 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారు. అయి తే వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోతే చెరువులు, ప్రాజెక్టులు, బోర్లపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో యాసంగి సీజన్‌లో నీటి లభ్యతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొనుగోలు భరోసా కల్పిస్తేనే..

ప్రస్తుత పరిస్థితుల్లో రైతులను ఆరుతడి పంటలవైపు మళ్లించడం వ్యవసాయశాఖకు సవాలుగా మా రింది. ఆయా పంటలపై అవగాహన కల్పించడంతో పాటు మార్కెటింగ్‌ సౌకర్యాలు, మద్దతు ధర, కొనుగోలు భరోసా కల్పి స్తేనే ఆరుతడి పంటల వైపు రైతులు ఆసక్తి చూపే అవకాశం ఉందని వ్యవసాయశాఖ నిపుణులు తెలుపుతున్నారు.

ఆరుతడి పంటల వివరాలు

పంట ఎకరాల్లో

కంది 869

పెసర 8,307

జొన్న 457

ఆయిల్‌పామ్‌ 584

కూరగాయలు 303

మిర్చి 2,487

పసుపు 242

ఇతర పంటలు 3,249

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement