భూపాలపల్లి: జిల్లాలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులతో పాటు గుడిసెల సర్వేను త్వరగా పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ, డీఆర్డీఓ, ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల, మున్సిపాలిటీ వారీగా మంజూరైన ఇళ్లు, నిర్మాణాల పురోగతి, పెండింగ్ పనులు, గుడిసెల సర్వే తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు మొత్తం 4,562 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 851 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు. వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, ముఖ్యంగా ఆర్‌సీసీ, రూఫ్ లెవెల్ దశల్లో ఉన్న నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 15 నాటికి నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూపాలపల్లి మండలంలో అదనంగా 200 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు, భూపాలపల్లి నియోజకవర్గంలో మొత్తం 1,100 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో నిలిచిన నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఇప్పటివరకు నిర్మాణాలు ప్రారంభం కాని ఇళ్లకు సంబంధించి నిధుల సమస్య, లబ్ధిదారుల అనాసక్తి, సాంకేతిక లోపాలు లేదా ఇతర కారణాలను క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా నమోదు చేయాలన్నారు. భాస్కర్‌గడ్డ 2బీహెచ్‌కే లేఅవుట్‌లో డ్రెయినేజీ (సీవరేజ్), విద్యుద్దీకరణ, తాగునీటి సరఫరా పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ నెల 31వ తేదీ సోమవారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి నిర్వహించనున్న సమీక్షా సమావేశానికి నిర్మాణాల పురోగతి, పెండింగ్ అంశాలు, లక్ష్యాల సాధనపై పూర్తి నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్డీఓ బాలకృష్ణ, పీఆర్ ఈఈ విద్యా సాగర్, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ఏఈ రాయలింగు, ఎంపీడీఓలు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


