● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
● స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
భూపాలపల్లి రూరల్: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి మండలం కమలాపూర్, గొల్లబుద్దారం, అజంనగర్, గూడాడ్‌పల్లి, నేరేడుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమాల్లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ అనేక ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేస్తుందని, అర్హత గల కుటుంబాలకు ఆహార భద్రత కల్పించాలనే లక్ష్యంతో స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తుందన్నారు. ఈ కార్డుల ద్వారా పారదర్శకంగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందనున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధి, రైతుల సంక్షేమం, పేదల జీవన ప్రమాణాల మెరుగుదలకు కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతకు ముందు ఆయా గ్రామాల్లో మహిళా భవన నిర్మాణాలు, అంగన్‌వాడీ భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


