జిల్లాలో ఘనంగా రక్షాబంధన్
భూపాలపల్లి అర్బన్: అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలకు, అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతీ ఏటా శ్రావణ పౌర్ణమి వేళ వచ్చే రక్షాబంధన్ పండుగ..అన్నాచెల్లెళ్ల బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఉదయం 6 గంటల నుంచే ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. అక్కాచెల్లెళ్లు.. అన్నదమ్ములకు రాఖీలు కట్టి మిఠాయి తినిపించారు. ఆర్టీసీ అధికారులకు పండుగ నేపథ్యంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినా.. బస్సుల కోసం ప్రయాణికులు పరుగులు తీశారు. పట్టణంలో రాఖీ, ఇతర దుకాణాలు అమ్మకాలతో రద్దీగా మారాయి. పలు పార్టీలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో రాఖీ పండుగ వేడుకలను పురస్కరించుకొని రాఖీలు కట్టి వేడుకలను నిర్వహించుకున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వృద్ధాశ్రయంలోని వృద్ధులకు రాఖీలు కట్టారు.


