భూపాలపల్లి అర్బన్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆర్డీఓ హరికృష్ణ శనివారం పరిశీలించారు. పట్టణంలోని రాంనగర్, సుభాష్ కాలనీ, హనుమాన్ నగర్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారుల సిబ్బందితో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఓటరు నమోదు, వివరాల సవరణపై అవగాహన కల్పిస్తూ, ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో చదువుకున్న యువత సహకరించాలని కోరారు. పట్టణంలో ఇప్పటివరకు డిజిటలైజేషన్ కేవలం 14 శాతం మాత్రమే పూర్తయిందన్నారు. ఈ నెల 20లోగా ప్రక్రియను పూర్తి చేయాలని సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలకు ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మి రాజయ్య, డిప్యూటీ తహసీల్దార్ అంజలిరెడ్డి, జీపీఓ కిరణ్ పాల్గొన్నారు.
14న కళాశాలల బంద్
భూపాలపల్లి అర్బన్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించి బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలల నుంచి యూనివర్సిటీల వరకు బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గుజ్జుల ప్రేమ్ తెలిపారు. భూపాలపల్లిలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు. 14న నిర్వహించే కళాశాలల బంద్‌ను విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రేపు కేంద్ర మంత్రి
కిషన్‌రెడ్డి రాక
భూపాలపల్లి రూరల్: ఈనెల 13న భూపాలపల్లి పట్టణంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సభ ఉందని.. పార్టీ నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి తెలిపారు. వీఎల్ కన్వెన్షన్ హాల్‌లో సభ ఏర్పాట్లను కీర్తిరెడ్డి శనివారం పరిశీలించారు. కీర్తిరెడ్డి వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్ రెడ్డి, లింగంపల్లి ప్రసాదరావు, రాష్ట కార్యవర్గ సభ్యులు ఎరుకల గణపతి, తదితర నాయకులు పాల్గొన్నారు.
పేకాట స్థావరంపై దాడి
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం కొత్తపల్లి(ఎస్‌ఎం) శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురిని సీసీఎస్ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.4,850 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ.. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ పరిసరాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనిస్తే సమీప పోలీస్‌స్టేషన్‌కు లేదా జిల్లా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
పర్యాటకుల సందడి
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయంలో శనివారం పర్యాటకుల సందడి నెలకొంది. వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధికసంఖ్యలో తరలివచ్చి రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశా రు. ఆలయ విశిష్టతను గైడ్‌లు విజయ్‌కుమార్, వెంకటేశ్‌లు వివరించారు. అనంతరం రామప్ప సరస్సు కట్టకు చేరుకొని సరస్సులో బోటు షికారు చేస్తూ సరస్సు అందాలను తిలకించారు.


