● డీఎంహెచ్‌ఓ మధుసూదన్
భూపాలపల్లి అర్బన్: సంతాన సమయంలో బిడ్డకు బిడ్డకు మధ్య మూడేళ్ల విరామం అవసరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ.. ఈ నెల 11నుంచి 18వరకు జిల్లావ్యాప్తంగా జనాభా నియంత్రణ, మాతా–శిశు సంరక్షణ అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బిడ్డకు బిడ్డకు మధ్య కనీసం మూడు సంవత్సరాల విరామం ఉండేలా కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలన్నారు. దీంతో తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. బాల్య వివాహాలను ప్రోత్సహించరాదని, చిన్న కుటుంబంతోనే ఆరోగ్యం, విద్య, ఆర్థికాభివృద్ధి, సమానత్వం సాధ్యమవుతాయని తెలిపారు. 2026 ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్ ‘యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడం–నేడు మరియు భవిష్యత్‌కోసం‘ అని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ, ఆరోగ్య సంరక్షణ, సుస్థిర అభివృద్ధిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 13న నిర్వహించే జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో ఉత్తమ సేవలు అందించిన డాక్టర్ దివ్య (జీజీహెచ్), డాక్టర్ రోహిణి (భూపాలపల్లి), ఏఎన్‌ఎం శ్రీలత (మొగుళ్లపల్లి), ఆశ కార్యకర్త రాజశ్రీ (పొట్లపల్లి), కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న మధుమితను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పీఓలు డాక్టర్ శ్రీదేవి, సందీప్, డెమో కె.శ్రీదేవి, ఏఎంఓ సుధాకర్, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.


