కాళేశ్వరంలో పనులకు ఫారెస్ట్ క్లియరెన్స్ చిక్కులు
అభివృద్ధి పనులకు అటవీశాఖ అనుమతులు లేక నిధులు మూలుగుతున్నాయి. మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వంతెన వరకు జాతీయ రహదారి 353(సీ)రోడ్డుకు అటవీశాఖ పలు కారణాలతో కొర్రీలు పెడుతూ వస్తోంది. దీంతో నేటికీ రోడ్డుకు మోక్షం కలుగలేదు. ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3.96 కోట్ల నిధులు మంజూరు చేసి ఏడాదిన్నర కావస్తున్నా రెవెన్యూ వర్సెస్ అటవీశాఖ మధ్యన స్థలం పంచాయితీ ఎటూ తేలడం లేదు. రూ.22కోట్ల వ్యయంతో పలుగుల టు కుంట్ల వరకు రోడ్డు నిర్మాణం కోసం మార్చిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేసినా అటవీశాఖ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో పనులు సాగడం లేదు. – కాళేశ్వరం
ప్రధాని మోదీ శంకుస్థాపన చేసినా..
మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వంతెన వరకు జాతీయ రహదారి 353(సీ) పనులకు నాలుగేళ్ల కిందట రూ.163 కోట్ల వ్యయంతో కేంద్ర నిధులతో రామగుండంలో వర్సువల్‌గా పీఎం నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు 14 కిలోమీటర్లలో 1,700 వరకు చెట్లు కోల్పోతుంది. కేంద్రం ఏజెన్సీ పర్యటించి ఎంత మేరకు రోడ్డు విస్తరణలో చెట్లు కోల్పోతున్నది అంచనా వేసింది. అటవీమార్గంలో కల్వర్టు వద్ద జంతువులు రోడ్డు క్రాస్ చేయడానికి నిర్మాణాలు చేయాలని సూచించారు. కేంద్రం పరిశీలనలో ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పట్లో అనుమతులు వచ్చేలా లేవని సమాచారం. రూ.163కోట్లు మంజూరైనా రోడ్డు పనులు మొదలు కాకుండా జాప్యం జరుగుతుంది. దీంతో వచ్చే ఏడాది కాళేశ్వరంలో జరిగే గోదావరి పుష్కరాల వరకు కూడా రోడ్డు నిర్మాణం అయ్యేలా కనిపించడం లేదు.
రెవెన్యూ.. ఫారెస్టు పంచాయితీ
కాళేశ్వరంలో ప్రస్తుతం ఉన్న పాత బస్టాండ్ స్థలం చిన్నగా ఉండడంతో పుష్కరాలు, ఉత్సవాలు జరిగినప్పుడు వినియోగించే తాత్కాలిక బస్టాండ్ స్థఽలంలో రెవెన్యూశాఖ 4.34 ఎకరాలను ఆర్టీసీకి కేటాయించింది. రూ.3.96 కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయి. పనులు మొదలు పెట్టే సమయంలో అటవీశాఖ అధికారులు అడ్డుకొని తమ రిజర్వు ఫారెస్టు భూమి అని నిలిపివేశారు. దీంతో ఆ రెండు శాఖల మధ్య పంచాయితీ ఎటూ తేలడం లేదు. మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకు వెళ్లినా ఇప్పటికీ స్పష్టత రాలేదని తెలిసింది. ఉన్నతాధికారులు స్పందిస్తే వచ్చే గోదావరి పుష్కరాల వరకు బస్టాండ్ భక్తులకు అందుబాటులోకి రానుంది.
8 కిలోమీటర్ల రోడ్డుకు..
మద్దులపల్లి క్రాస్‌రోడ్డు నుంచి కుంట్లం గ్రామం వరకు 8 కిలోమీటర్ల రోడ్డుకు అటవీశాఖ మెలిక పెట్టిందని తెలిసింది. ఇప్పటికే ఉన్నటువంటి రోడ్డుకు ప్రస్తుతం ప్రభుత్వం రూ.23 కోట్లు మంజూరు చేసింది. కానీ రోడ్డు విస్తరణకు అటవీశాఖ అడ్డంకి చెప్పడంతో మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ప్రస్తుతం కలెక్టర్, డీఎఫ్‌ఓల పరిశీలనలో ఉంది. కానీ వర్షాకాలం సీజన్ కావడంతో పలుగుల, కుంట్లం గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవని విమర్శలు ఉన్నాయి.
ఎన్‌హెచ్ అనుమతులకు పంపాం..
మహదేవపూర్ టు కాళేశ్వరం వరకు 14 కిలోమీటర్ల అడవిలో రోడ్డు నిర్మాణానికి మా తరఫున పెండింగ్ లేదు. కేంద్రానికి ఆన్‌లైన్‌లో పంపాం. కేంద్రం ఏజెన్సీ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. ఆర్టీసీకి ఎక్కడా మా ఫారెస్టు తరఫున స్థలం కేటాయించలేదు. రెవెన్యూ పత్రం తీసుకువచ్చారు. కానీ తమ ఫారెస్టు నుంచి అనుమతులు లేవు. పలుగుల రోడ్డుకు త్వరలో అనుమతులతో పనులు ప్రారంభం కానున్నాయి.
– సందీప్‌రెడ్డి, ఎఫ్‌డీఓ, మహదేవపూర్
ఎన్‌హెచ్, బస్టాండ్, రోడ్డు అభివృద్ధి పనులకు బ్రేక్
పట్టించుకోని పాలకులు, ఉన్నతాధికారులు


