స్టేషన్‌ ఘన్‌పూర్‌లో నేడు డిప్యూటీ సీఎం పర్యటన | - | Sakshi
Sakshi News home page

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో నేడు డిప్యూటీ సీఎం పర్యటన

Jun 9 2026 5:42 AM | Updated on Jun 9 2026 5:42 AM

జనగామ: జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో నేడు (మంగళవారం) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఎన్పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 4 సబ్‌స్టేషన్లను ప్రారంభించడంతోపాటు మరో 3 సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ఎంపీ కడియం కావ్య, కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా, డీసీసీ అధ్యక్షురాలు లకావత్‌ ధన్వంతి తదితరులు హాజరుకానున్నారు.

కోటగుళ్లలో ప్రత్యేక పూజలు

గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో ఉదయం నుంచి గణపేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు.భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు.

మృగశిర కార్తె వచ్చె..

వర్షం తెచ్చె..

కాళేశ్వరం: ఎండల తీవ్రతతో సతమతమవుతున్న ప్రజలకు భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సోమవారం రాత్రి మహదేవపూర్‌, కాళేశ్వరంలో గంటన్నరపాటు వర్షం కురిసింది. మృగశిర కార్తె సందర్భంగా కురిసిన ఈ వర్షాన్ని ప్రజలు శుభసూచకంగా భావిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా 46–47 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. తాజాగా కురిసిన వర్షంతో మండల వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో ఖరీఫ్‌ సీజన్‌లో మొదటి వర్షం కావడంతో రైతులు వ్యవసాయ పనులకు సిద్ధం కానున్నారు.

ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన సదస్సు

భూపాలపల్లి అర్బన్‌: ఘన వ్యర్థాల నిర్వహణపై సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌, స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు చెందిన 60మంది కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీపీసీబీ నోడల్‌ అధికారి శ్రీకాంత్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు, తడి–పొడి చెత్త వేరుచేసే విధానం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు. చెత్త రహిత గ్రామాలు, పట్టణాల నిర్మాణంలో కార్మికుల పాత్ర, పరిశుభ్రత ప్రమాణాల అమలుపై జిల్లా స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కో–ఆర్డినేటర్‌ వెంకటేష్‌ సూచనలు చేశారు. మున్సిపల్‌ పరిధిని పరిశుభ్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దడంలో క్షేత్రస్థాయి సిబ్బంది కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

హేమాచలక్షేత్రంలో 11న బహిరంగ వేలం

మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల షాపుల నిర్వాహణ హక్కులు పొందేందుకు ఈనెల 11న దేవాదాయఽ శాఖ ఆధ్వర్యంలో బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్‌చార్జ్‌ కార్యనిర్వాహణాధికారి వీరస్వామి సోమవారం తెలిపారు. 2026 మే 15 నుంచి 2027 జూన్‌ 25 వరకు సంవత్సరం పాటు కొబ్బరి కాయలు, పూజసామగ్రి విక్రయాలు జరుపుకునేందుకు 2 షాపులు, క్యాంటీన్లు 2, బొమ్మలు, గాజులు, దేవుడి ఫొటోలు విక్రయ షాపులకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 11న ఉదయం 11 గంటలకు హేమాచల క్షేత్రంలోని కల్యాణ మండపంలో నిర్వహించే వేలంలో పాల్గొనే వారు కొబ్బరికాయలు, పూజ సామగ్రి ఒక్కో షాపునకు రూ.50,000, బొమ్మలు, గాజులు, క్యాంటీన్లు ఒక్కో షాపునకు రూ.25,000 చొప్పున దరావత్తు చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement