అధికారులకు క్షేత్రస్థాయి అవగాహన కీలకం | - | Sakshi
Sakshi News home page

అధికారులకు క్షేత్రస్థాయి అవగాహన కీలకం

Jun 9 2026 5:42 AM | Updated on Jun 9 2026 5:42 AM

భూపాలపల్లి: ప్రతి అధికారికి క్షేత్ర స్థాయి అవగాహన అత్యంత కీలకమని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ పేర్కొన్నారు. 2025 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారుల శిక్షణలో భాగంగా ‘తెలంగాణ దర్శన్‌’ కార్యక్రమం కింద ఆరుగురు ట్రెయినీ ఐఏఎస్‌ అధికారులు ఆదివారం, సోమవారం జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని పాండవులగుట్ట (రేగొండ మండలం), కేటీపీపీ(చెల్పూర్‌), సింగరేణి ఓపెన్‌కాస్ట్‌, భూగర్భ గనులను సందర్శించారు. రెండు రోజుల పర్యటన ముగిసిన అనంతరం, సోమవారం శిక్షణా ఐఏఎస్‌ అధికారులు ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్‌ రాహుల్‌ శర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో నిర్వహించిన పర్యటనకు సంబంధించిన వివిధ అంశాలను అధికారుల బృందాన్ని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. జిల్లాలో పర్యటించిన వారిలో ట్రెయినీ ఐఏఎస్‌లు ఇట్టబోయిన సాయి శివాణి, సచిన్‌ బసవరాజ్‌, ఎన్‌ శ్రీకాంత్‌రెడ్డి, పోతరాజు హరిప్రసాద్‌, పరాస్‌ కుమార్‌, సురేష్‌ పామూరి ఉన్నారు.

సమస్యల పరిష్కారానికి గ్రామసభలే వేదిక

మల్హర్‌: గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు గ్రామసభలు సమర్థవంతమైన వేదికగా నిలుస్తాయని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అన్నారు. సోమవారం మల్హర్‌ మండలం రుద్రారం గ్రామంలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం’లో భాగంగా నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్‌ రాహుల్‌శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతీ గ్రామసభలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామసభల ద్వారా గ్రామస్తుల సమస్యలను నేరుగా తెలుసుకొని త్వరితగతిన పరిష్కరించే అవకాశం కలుగుతుందని చెప్పారు. ముఖ్యంగా ఎస్‌ఐఆర్‌ నమోదు ప్రక్రియ, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు పంటల సేద్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు పారిశుద్ధ్యం, కాలుష్య నియంత్రణ, సురక్షిత తాగునీటి నిర్వహణ తదితర కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్‌ వివరించారు. అందిన సమస్యలను సంబంధిత అధికారుల ద్వారా వెంటనే పరిశీలించి, త్వరితగతిన పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, ఆర్డీఓ రవీందర్‌, మండల ప్రత్యేక అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు, తహసీల్దార్‌ రవికుమార్‌, ఎంపీడీఓ క్రాంతికుమార్‌, సీడీపీఓ రాధిక, సర్పంచ్‌ సంపత్‌ పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

Advertisement
 
Advertisement
Advertisement