గుట్కా జోరు | - | Sakshi
Sakshi News home page

గుట్కా జోరు

Jun 8 2026 7:06 AM | Updated on Jun 8 2026 7:06 AM

ఏం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది..

జిల్లాలో యథేచ్ఛగా విక్రయాలు

భూపాలపల్లి అర్బన్‌: నిషేధిత గుట్కా వ్యాపారం జిల్లాలో మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. ప్రభుత్వం గుట్కా విక్రయాలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించినప్పటికీ ఇక్కడి కేటుగాళ్లు మాత్రం యథేచ్ఛగా నల్లబజారులో దందాను కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ నుంచి గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తూ స్థానిక కిరాణషాపులు, పాన్‌ డబ్బాల్లో రెట్టింపు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అప్పుడప్పుడు నామమాత్రపు దాడులు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఈ అక్రమవ్యాపారానికి అడ్డుకట్ట పడడం లేదు. అధికారుల లీలలు, మాఫియా నెట్‌వర్క్‌ కారణంగా జిల్లాలో యువత గుట్కా వ్యసనానికి బానిసవుతూ ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటుంది.

ఎక్కడా తగ్గలే..

జిల్లాకేంద్రంతో పాటు కాటారం, మహదేవపూర్‌, మల్హర్‌, టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి, గణపు రం, రేగొండ తదితర మండలాల్లో గుట్కా విక్రయాలు బహిరంగంగానే జరుగుతున్నాయి. పాఠశాలలు, కళాశాలల సమీపంలోని చిన్న దుకాణాల నుంచి గ్రామీణ ప్రాంతాల కిరాణా షాపుల వరకు నిషేధిత గుట్కా ప్యాకెట్లు సులభంగా లభిస్తున్నాయి. ప్రభుత్వం నిషేధించినా విక్రయాలు మాత్రం ఎక్కడా తగ్గుముఖం పట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌

ప్రాంతాల నుంచి

జిల్లాలో విక్రయమవుతున్న గుట్కా ఉత్పత్తులలో ఎక్కువ భాగం హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ వంటి ప్రాంతాల నుంచి ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాల ద్వారా రహస్యంగా జిల్లాకు చేరుతున్నట్లు సమాచారం. ఆదివారం ఉదయం భూపాలపల్లి సీసీఎస్‌ పోలీసులు ట్రాన్స్‌పోర్ట్‌ వాహనంలో వచ్చిన ఆరు నిషేధిత గుట్కా సంచులను పట్టుకున్నారు. సాధారణ సరుకుల మధ్య గుట్కా కార్టన్‌లను దాచిపెట్టి రవాణా చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రైవేట్‌ వాహనాలు, చిన్న సరుకు రవాణా వాహనాలను కూడా వినియోగిస్తున్నట్లు సమాచారం. అక్రమ రవాణాదారులు తనిఖీలను తప్పించుకునేందుకు కొత్త మార్గాలను అనుసరిస్తున్నారని, రాత్రి వేళల్లో ఎక్కువగా సరఫరాలు జరుగుతున్నాయని తెలిసింది. జిల్లా కేంద్రంతో పాటు కాటారం, మహదేవపూర్‌లకు చేరిన తర్వాత చిన్న వ్యాపారుల ద్వారా గ్రామాలకు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

నోటి క్యాన్సర్‌, దంత సమస్యలు..

గుట్కా వినియోగం కారణంగా యువతలో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటి క్యాన్సర్‌, దంత సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలకు గుట్కా ప్రధాన కారణంగా మారుతోందని చెబుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువకులు సులభంగా గుట్కాకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. తక్కువ ధరలో లభించడం, సులభంగా అందుబాటులో ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా గుట్కా వినియోగం పెరుగుతోందని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై కూడా ఈ వ్యసనం ప్రతికూల ప్రభావం చూపుతోందని అంటున్నారు.

నిషేధం కాగితాలకే పరిమితమా..?

ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 ప్రకారం మానవ ఆరోగ్యానికి హానికరమైన ఆహార పదార్ధాల తయారీ నిల్వ పంపిణీ, విక్రయాలు నిషేధించింది. గుట్కా విక్రయాలపై ప్రభుత్వం పలుమార్లు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటి అమలు విషయంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆహార భద్రత శాఖ, పోలీస్‌ శాఖ, ఇతరశాఖల అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ అక్రమ వ్యాపారం కొనసాగుతుండటం పర్యవేక్షణలో లోపాలను సూచిస్తోంది.

జిల్లాలో గుట్కా అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి

ట్రాన్స్‌పోర్ట్‌ కేంద్రాలు, గోదాములు, హోల్‌సేల్‌ వ్యాపార కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి

గుట్కా సరఫరా దందాలో ఉన్న ప్రధాన నిర్వాహకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వం విధించిన నిషేధం అధికారులు సమర్థవంతంగా అమలుచేయాలి

నిషేధం అమలు కావాలంటే సంబంధిత శాఖల మధ్య సమన్వయం పెరగాలి

నిరంతర పర్యవేక్షణ, ప్రత్యేక దాడులు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి

ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గుట్కా విక్రయాలపై అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలి

నిషేధం ఉన్నా బహిరంగంగానే వ్యాపారం

హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ నుంచి భారీగా దిగుమతి

అధికారుల నామమాత్రపు దాడులు

యువత భవిత బుగ్గిపాలు

Advertisement
 
Advertisement
Advertisement