భూ తగాదాతో వ్యక్తిపై కత్తితో దాడి | - | Sakshi
Sakshi News home page

భూ తగాదాతో వ్యక్తిపై కత్తితో దాడి

Jun 8 2026 6:54 AM | Updated on Jun 8 2026 6:54 AM

చిట్యాల: భూ తగాదాల విషయంలో ఒకరిపై కత్తితో దాడిచేసి గాయపరిచిన ఘటన మండలంలోని కొత్తపేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన ఎండీ.రాజ్‌మహ్మద్‌కు అదే గ్రామానికి చెందిన చిగురు నరేష్‌కు మధ్య గతంలో భూతగాదాల విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆదివారం గ్రామ శివారులో ట్రాక్టర్‌లలో మట్టి తరలిస్తున్న క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆవేశానికి గురైన నరేష్‌ కత్తితో రాజ్‌మహ్మద్‌పై దాడిచేయడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. ఇది గమనించిన గ్రామస్తులు రాజ్‌మహ్మద్‌ను సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హనుమకొండ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి సోదరుడు అఫ్జల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పోచంపల్లి సతీష్‌ తెలిపారు.

కేయూ బాటనీ విభాగం అధిపతిగా మమత

కేయూ క్యాంపస్‌: కేయూ బాటనీ విభాగం అధిపతిగా యూనివర్సిటీ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌, కెమిస్ట్రీ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ మమతను నియమిస్తూ (తదుపరి ఉత్వర్వులు వెలువడేవరకు) రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఆమె ఈనెల 6న సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ప్రొఫెసర్‌ లలితాకుమారి ఇప్పటివరకు బాటనీ విభాగం అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె పదవీ కాలం ముగియగా మళ్లీ విభాగం అధిపతిగా యూనివర్సిటీ అధికారులు కొనసాగించడం లేదు. దీంతో మమతను బాటనీ విభాగం అధిపతిగా నియమించారు.

కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లలో

ఒకరికి అవకాశం?

యూనివర్సిటీలోని బాటనీ విభాగంలో ఒక్కరు రెగ్యులర్‌ ఫ్రొఫెసర్‌, ఐదుగురు కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉన్నారు. కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌నే బాటనీ విభాగం అధిపతిగా నియమిస్తారా అనేది యూనివర్సిటీలో చర్చనీయాంశమైంది. సీనియారిటీని పరిగణనలోనికి తీసుకొని విభాగం అధిపతిగా ఒక కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ను నియమించాలని వీసీ, రిజిస్ట్రార్‌ను కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు కోరినట్లు సమాచారం.

నేటి నుంచి కేయూ దూరవిద్య పీజీ సెమిస్టర్‌ పరీక్షలు

కేయూ క్యాంపస్‌: కేయూ పరిధి దూరవిద్య సీడీఓఈ/ఎస్‌డీఎల్‌సీఈ ఎంఏ, ఎంకామ్‌, హెచ్‌ఆర్‌ఎం, జేఎంసీ, ఎమ్మెస్సీ కోర్సుల (2023–24 బ్యాచ్‌) మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 8వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ పద్మజ తెలిపారు. ఈనెల 8, 10, 12, 15, 17, 19, 22 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా తేదీల్లో పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, 2,354 మంది పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు.

హేమాచల క్షేత్రంలో కోలాహలం

మంగపేట: మండల పరిధిలోని మల్లూరు హేమాచల క్షేత్రంలోని లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. సెలవురోజు కావడంతో రాష్ట్రంలోని వరంగల్‌, హైదరాబాద్‌, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్‌ తదితర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి, గుంటూరు నుంచి భక్తులు భారీ సంఖ్యలో వివిధ వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్నారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో స్వయంభు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ పూజారులు భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement