కనెక్షన్ల వివరాలు
భూపాలపల్లి: సామాన్యుడి వంటగదిలో మరోమారు ‘గ్యాస్’ మంటలు రేగాయి. నిత్యం పెరుగుతున్న ధరలతో ఇప్పటికే సతమతం అవుతున్న పేద, మధ్యతరగతి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి భారాల వడ్డన వదిలింది. గృహావసరాలకు వినియోగించే(డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్ ధరను ఆదివారం నుంచే రూ.29 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించడంతో వినియోగదారులు ఒక్కసారిగా బిత్తెరపోయారు.
మూడు నెలల్లోనే రెండోసారి..
మూడు నెలల క్రితం మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.60 మేర పెంచి షాక్ ఇచ్చింది. ఆ భారం నుంచి కోలుకోకముందే, ఇప్పుడు మరోమారు రూ.29 పెంచింది. తాజా పెంపుతో జిల్లాలో గ్యాస్ సిలిండర్ ధర రికార్డు స్థాయిలో రూ.1,013కు చేరుకుంది. సిలిండర్ ధర రూ.వేయి దాటడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు.
జిల్లా ప్రజలపై భారం..
గ్యాస్ సిలిండర్ ధర పెంపు ప్రభావం జిల్లాపై తీవ్రంగా పడనుంది. జిల్లాలో హెచ్‌పీ, భారత్, ఇండేన్ గ్యాస్ కంపెనీలకు చెందిన డొమెస్టిక్ కనెక్షన్లు మొత్తం 1,31,426 ఉన్నాయి. ఆదివారం పెరిగిన రూ.29 ధరతో పోల్చి చూస్తే.. జిల్లాలోని గ్యాస్ వినియోగదారులపై నెలకు ఏకంగా రూ.38,11,354 అదనపు భారం పడనుంది. నిత్యావసరాల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతుండగా, ఇప్పుడు గ్యాస్ బిల్లు కూడా పెరగడంతో నెలవారీ బడ్జెట్ తలకిందులు అవుతుందని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– నునావత్ విజయ, గృహిణి, మహాముత్తారం
హెచ్‌పీ 49,345
ఇండేన్ 43,106
భారత్ 38,975
మొత్తం 1,31,426
మళ్లీ పెరిగిన సిలిండర్ ధర
రూ.29 పెంపుతో రూ.1,013
జిల్లా ప్రజలపై నెలకు
రూ.38,11,354 భారం


