● 17న కాళేశ్వరం దేవస్థానం
అభివృద్ధి పనులు ప్రారంభం
● షాపింగ్ కాంప్లెక్సు నిర్వాహకుల
ఆందోళన
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం అభివృద్ధి పనులకు ఈనెల 17న ముహూర్తం ఖరారు కావడంతో భక్తులు, ప్రజల్లో సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. కాళేశ్వరం దేవస్థానానికి రూ.198కోట్ల వ్యయంతో రాతి నిర్మాణం పనులు చేపడుతుండగా, ప్రస్తుత గర్భాలయంతో పాటు పలు ఉప ఆలయాల తొలిగింపు ప్రక్రియ జరుగనుంది. దీంతో గర్భాలయంలోని జోడు లింగాలకు తమిళనాడులోని శిల్పులు కొలతలు తీసుకున్నారు. వాటిని యధాస్థితిలో ఉంచి నిర్మాణ సమయంలో ప్రమాదం లేకుండా పైన కప్పులాగా నిర్మించనున్నారు. అడవిలోని ఆదిముక్తీశ్వరాలయం వద్ద బాలాలయం ఏర్పాటు కానుందని తెలిసింది. అక్కడే పూజలు నిర్వహణ జరుగుతుందని తెలిసింది. కానీ శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ పూజలు ప్రతీ మంగళవారం నిర్వహిస్తారు. శనివారం నవగ్రహాల వద్ద శనిపూజలు భక్తులు అధిక సంఖ్యలో నిర్వహిస్తుంటారు. ఆలయ పునరుద్ధరణ నేపథ్యంలో పూజలు ఎక్కడ నిర్వహిస్తారనేది భక్తులు, స్థానికుల్లో ఆందోళనలు కలుగుతున్నాయి. కాలసర్ప, శనిపూజలు వీఐపీఘాటులో ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. భక్తులు నేరుగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి అక్కడే పూజలు చేసి ఆదిముక్తీశ్వరాలయంలో అభిషేక పూజలు చేసుకునేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అలా కాకుండా ఆదిముక్తీశ్వరాలయం వద్ద శని, కాలసర్ప నివారణ పూజలు చేసే వీలు కల్పిస్తారా అనేది ఈ నెల 10వ తేదీ వరకు దేవాదాయశాఖ ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలిసింది. కాళేశ్వరం దేవస్థానం పరిధిలోని షాపింగ్ కాంప్లెక్సు తొలగించనున్న కారణంగా ఆయా షాపుల సముదాయాల్లో వివిధ దుకాణాలు, బొమ్మలు, మనియార్, పూలు, కొబ్బరికాయలు, పూజా సామగ్రి, హోటళ్లు నిర్వహణకు ప్రతియేటా రూ.కోటికి పైగా ఆలయానికి ఆదాయం వస్తుంది. ఆదిముక్తీశ్వరస్వామి ఆలయం వద్ద దుకాణాలు ఎలా కేటాయిస్తారో అని ఎదురు చూస్తున్నారు. వీఐపీ ఘాటు వద్ద శని, కాలసర్ప పూజలు ఏర్పాటు చేస్తే దుకాణాల నిర్వహణ రెండు చోట్ల ఏర్పాటు చేసే వీలున్నట్లు సమాచారం. దీంతో దుకాణాల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. పునరుద్ధరణతో ఏమైనా కాల వ్యవధి పొడిగిస్తారా అనేది తెలియాల్సి ఉంది.


