నకిలీ భయం | - | Sakshi
Sakshi News home page

నకిలీ భయం

Jun 7 2026 8:00 AM | Updated on Jun 7 2026 8:00 AM

పత్తిసాగుపై నిషేధిత బీటీ 3 నీడ

భూపాలపల్లి: వానాకాలం సీజన్‌ ప్రారంభం కానుండటంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదే తరుణంలో అక్రమార్కులు మళ్లీ కోరలు చాస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా నిషేధించిన బీటీ–3 (హెచ్‌టీబీటీ–హెర్బిసైడ్‌ టొలరెంట్‌ బీటీ) పత్తి విత్తనాలు, ప్రాణాంతక గ్లైఫోసెట్‌ గడ్డిమందు మార్కెట్‌లోకి గుట్టు చప్పుడు కాకుండా ప్రవేశించనున్నాయి.

గతేడాది నూజివీడు లింకులు బహిర్గతం..

గతేడాది ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలోని కాటారం, మల్హర్‌, మహాముత్తారం మండలాల్లో నిషేధిత బీటీ–3 విత్తనాలు, గ్లైఫోసెట్‌ గడ్డిమందు భారీస్థాయిలో పట్టుబడటం సంచలనం సృష్టించింది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ నకిలీ దందాను పోలీసు అధికారులు ఛేదించారు. మహాముత్తారం మండలంలోని మీనాజిపేటలో 250 గ్రాముల బీటీ పత్తి విత్తనాలు దొరికాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయని పోలీసులు ఆరాతీయగా తీగ లాగితే డొంకంతా కదిలింది. కాటారం మండలంలో గ్లైఫోసెట్‌ దొరకగా, మల్హర్‌ మండలం రుద్రారంలో ఏకంగా 2 క్వింటాళ్ల బీటీ 3 పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇక్కడి ఫర్టిలైజర్‌ షాపుల యజమానులతో కలిసి నూజివీడు నుంచి బీటీ 3 విత్తనాలను ట్రాన్స్‌పోర్ట్‌లో వేసి పంపినట్లు తేలింది. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులపై కేసులు నమోదైనప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జిల్లాలోని వందలాది మంది అమాయక రైతులు ఆ విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేశారు. చివరకు మొలకలు రాక, పంట దెబ్బతిని, తాము కొన్నది నకిలీ విత్తనాలు అని తెలుసుకునే సరికి పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరైంది.

అడ్డుకట్ట పడేనా..

గతేడాది కాటారం డివిజన్‌లో ఈ అక్రమ దందా బహిర్గతం అయినప్పటికీ భూపాలపల్లి డివిజన్‌లో సైతం ప్రతీ ఏటా జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పోలీసు, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి టాస్క్‌ఫోర్స్‌ టీంలను ఏర్పాటు చేశారు. దీంతో ఈ ఏడాదైనా నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల విక్రయాలకు అడ్డుకట్ట పడేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.

బీటీ 3తో తీవ్ర నష్టం..

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న బీటీ 2 విత్తనాలు కేవలం పురుగులను మాత్రమే తట్టుకుంటాయి. బీటీ–3 (హెచ్‌టీబీటీ) విత్తన జన్యువును ఎలా మారుస్తారంటే.. పొలంలో గడ్డి మొలవకుండా కొట్టే గ్లైఫోసెట్‌ అనే శక్తివంతమైన కెమికల్‌ను కూడా ఈ పత్తి మొక్క తట్టుకోగలదు. గ్లైఫోసెట్‌ క్యాన్సర్‌ కారకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అంతేకాక పర్యావరణం సైతం తీవ్రంగా దెబ్బతింటుంది. మానవ మనుగడకే ప్రమాదకరం అయినందున కేంద్ర ప్రభుత్వం దీనిపై నిషేధం విధించింది.

అవగాహన సదస్సులు ఏవి?

గతేడాది తరహాలో జిల్లాలోని రైతులు మోసపోయారు. ఈసారి మోసపోకుండా ఉండేందుకు వ్యవసాయ అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మండల, జిల్లాస్థాయి అధికారులు ప్రకటనలకే పరిమితం అవుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం లేదు. దీంతో రైతులు నష్టపోయే అవకాశం ఉంది.

గతేడాది వెలుగుచూసిన నూజివీడు లింకులు

ఈ ఏడాదైనా అడ్డుకట్ట పడేనా?

తనిఖీల కోసం టాస్క్‌ఫోర్స్‌ టీంల ఏర్పాటు

Advertisement
 
Advertisement
Advertisement