భూపాలపల్లి రూరల్: ఈ నెల 19న జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో కిసాన్‌మేళా ఏర్పాటుచేస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయశాఖ చేపట్టే కార్యక్రమాలను వ్యవసాయ శాస్త్రవేత్తలను చర్చించనున్నట్లు తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కిసాన్ మేళాను విజయవంతం చేయాలని కోరారు.
ఆదిముక్తీశ్వరాలయంలో దర్శనాలు?
కాళేశ్వరం: ఈ నెల 17న కాళేశ్వరం దేవస్థానంలో శంగేరి పీఠం శిష్య బృందం ఆధ్వర్యంలో కళాపకర్షణ క్రతువు నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా కొత్త రాతి నిర్మాణాలు, పాత దేవాలయాల తొలగింపు పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ఆలయంలో భక్తుల దర్శనాలకు అంతరాయం కలగనున్నందున భక్తులకు దర్శన సౌకర్యం కల్పించేందుకు దేవాదాయ శాఖ అడవి ప్రాంతంలో ఉన్న ఆది ముక్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. పునర్నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు భక్తులు అక్కడే స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆలయంలో ఒకే పాన వట్టంపై ఉన్న జోడు లింగాలకు (శివుడు, యముడు) ప్రమాదం లేకుండా పై కప్పు నిర్మిస్తున్నారు. దర్శనాల ఏర్పాట్లు, సమయాలు ఇతర వివరాలపై దేవస్థానం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
రేగొండ: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. మండలంలోని కనిపర్తి గ్రామ శివారులో శనివారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నారు. అనంతరం ట్రాక్టర్ డ్రైవర్లు కౌటం ప్రశాంత్, పున్నం రమేష్, కుర్రే కిరణ్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గోదావరిలో తగ్గుతున్న నీటిమట్టం
కన్నాయిగూడెం: గోదావరిలో నీరు తగ్గుముఖం పడుతుండడంతో సమ్మక్కసాగర్ బ్యారేజీ ఎగువన బండలు తేలి బయట కనిపిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న నీటిని సమ్మక్కసాగర్ గేట్లు ఎత్తి నీటిని ఎప్పటికప్పుడు దిగువకు వదులుతుండడంతో బ్యారేజీ ఎగువన నీటిమట్టం తగ్గుతోంది. ఈ క్రమంలో గోదావరిలో ఉన్న బండరాళ్లు బయట పడ్డాయి. బ్యారేజీ నిర్మాణం సమయంలో నీటిని మళ్లించి నిర్మాణాలు చేయాలని గోదావరికి అడ్డుగా కాఫర్ డ్యామ్‌ను బండరాళ్లతో నిర్మించారు. నిర్మాణం పూర్తి కావడంతో పాటు గోదావరిలోకి భారీగా వరదలు వచ్చి చేరడంతో అక్కడే ఉండిపోయింది. దీంతో నీరు తగ్గడంతో గోదావరి పొడవున బండరాళ్లు రోడ్డుమాదిరిగా కనిపిస్తున్నాయి.
కాజీపేట మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ప్రయాణికుల సౌకర్యార్థం బిలాస్‌పూర్–బెంగళూరు కాంట్ మధ్య వేసవి ప్రత్యేక రైలును నడిపిస్తున్నట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ ఎ.శ్రీధర్ తెలిపారు. ఈనెల 12న బిలాస్‌పూర్–బెంగళూరు కాంట్ (08263) వెళ్లే వీక్లీ ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. ఈరైలుకు భత్‌పర, రాయ్‌పూర్, దుర్గ్, వాడ్స, చాంద్‌ఫోర్ట్, బల్లార్షా, సిర్‌పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, కాజీపేట, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాద్గిర్, కృష్ణ, రాయ్‌చూర్, మంత్రాలయం రోడ్డు, గుంతకల్, గూటి, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, యెలహంకలో హాల్టింగ్ కల్పించారు.


