కీలక పోస్టులు ఖాళీ | - | Sakshi
Sakshi News home page

కీలక పోస్టులు ఖాళీ

Jun 7 2026 8:00 AM | Updated on Jun 7 2026 8:00 AM

ఏటూరునాగారం: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పాటైన ఏటూరునాగారం ఐటీడీఏలో ప్రస్తుతం పలు కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలక పోస్టులు నెలల తరబడి ఖాళీగా ఉండడంతో గిరిజనుల సంక్షేమం కుంటుపడుతోంది. దీనిపై పాలకులు, అధికారులు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. దీంతో గిరిజనులకు ఇబ్బందులు తప్పేలా లేవు.

ఖాళీలు ఏం ఉన్నాయంటే..

ఏటూరునాగారం ఐటీడీఏ అసిస్టెంట్‌ ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్న నాగోరావు గతనెల 31న పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ భర్తీ చేయలేదు. ఐటీడీఏ పరిపాలన అధికారిగా పనిచేసే రాంబాబు గతేడాది డిప్యూటేషన్‌పై భద్రాచలం ఐటీడీఏకు వెళ్లారు. అప్పుడు ఎస్‌ఓగా రాజ్‌కుమార్‌కు ఏఓ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాజ్‌కుమార్‌ బదిలీపై ఉట్నూరు వెళ్లడంతో ఏఓ పోస్టు ఖాళీగా ఉంది. భద్రాచలంలో పనిచేస్తున్న ఏఓ రాంబాబు డిప్యూటేషన్‌ రద్దు చేసి ఐటీడీఏకు తిరిగి రప్పించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులూ రాలేదు. ఎస్‌ఓ రాజ్‌కుమార్‌ బదిలీ కావడంతో ఎస్‌ఓ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కార్యాయంలో పనిచేస్తున్న డీటీ(డిప్యూటీ తహశీల్దార్‌) కిశోర్‌ను కన్నాయిగూడెం తహశీల్దార్‌ కార్యాలయానికి డిప్యూటేషన్‌పై పంపించారు. కన్నాయిగూడెంలో రెగ్యులర్‌ డీటీ వచ్చినప్పటికీ ఐటీడీఏ నుంచి వెళ్లిన డీటీ డిప్యూటేషన్‌ను రద్దు చేయకపోవడంతో ఐటీడీఏలో ఎస్‌డీసీ కార్యాలయంలో డీటీ పోస్టు ఖాళీగా ఉంది. ఇలా అనేక కీలక పోస్టుల్లోని అధికారులు బదిలీలు, డిప్యూటేషన్‌లలో ఉండడంతో కార్యాలయం పనితీరు అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి ఐటీడీఏ కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని గిరిజనులు కోరుకుంటున్నారు.

ఏటూరునాగారం ఐటీడీఏలో ఇన్‌చార్జ్‌ అధికారులు

డిప్యుటేషన్‌లో కొందరు.. బదిలీలో మరికొందరు..

పట్టించుకోని పాలకులు, అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement