మహిళా సాధికారతే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారతే ధ్యేయం

Jun 7 2026 8:00 AM | Updated on Jun 7 2026 8:00 AM

భూపాలపల్లి రూరల్‌: మహిళా సాధికారతే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. శనివారం భూపాలపల్లి మండలం గుర్రంపేట రెవెన్యూ పరిధిలోని గుర్రంపేట, రామ్‌ నాయక్‌ తండా, పెద్దాపూర్‌, బావుసింగ్‌పల్లి, సుబ్బక్కపల్లి గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి గుర్రంపేటలో ఏర్పాటుచేసిన ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో మంత్రి సీతక్క, కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఐడీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పోతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వారి వద్దకే వెళ్లి తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించడమే ప్రజా దర్బార్‌ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ములుగు నియోజకవర్గంలో ఇప్పటివరకు 70 గ్రామాల్లో ప్రజా దర్బార్‌ కార్యక్రమాలు నిర్వహించామని, ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను నాలుగు రోజులలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గంలో లక్షకు పైగా పెన్షన్లు అందించామని, రాబోయే రోజుల్లో మరో రెండు నుంచి మూడు లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు. రామ్‌నాయక్‌ తండా పేరు మార్పు అంశంపై గ్రామసభ తీర్మానం చేసి ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మాట్లాడుతూ... ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల అమలుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి నవీన్‌ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్‌ కుమార్‌, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్‌ లక్ష్మీరాజయ్య, ఎంపీడీఓ తరుణ్‌ ప్రసాద్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క

ప్రజాదర్బార్‌లో దరఖాస్తుల స్వీకరణ

Advertisement
 
Advertisement
Advertisement