భూపాలపల్లి అర్బన్: మాదక ద్రవ్యాల వినియోగంతో యువత ప్రాణాలకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతుందని సీసీఎస్ ఎస్సై రమేష్ తెలిపారు. సీసీఎస్, షీ టీంల ఆధ్వర్యంలో శనివారం జిల్లాకేంద్రంలో వేర్వేరుగా మెడికల్ కళాశాల, ఐటీ మాస్టర్స్ కంప్యూటర్స్, ఆర్టీసీ బస్టాండ్‌లలో మహిళలు, బాలికల భద్రత, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాలలో సీసీఎస్ ఎస్సై రమేష్ మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారిందన్నారు. ఉద్యోగాలు, విద్య వివాహాల పేరుతో మోసాలకు పాల్పడే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా, ఆన్‌లైన్ వేదికల ద్వారా వచ్చే అనుమానాస్పద ఆఫర్లను నమ్మవద్దన్నారు. మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారంం తెలిసిన, ఆడ పిల్లలకు ఇబ్బంది ఎదురైనా వెంటనే పోలీసులను సమాచారం అందించాలని సూచించారు. చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.


