● ఎమ్మెల్యే సత్యనారాయణరావు,
కలెక్టర్ రాహుల్‌శర్మ
భూపాలపల్లి రూరల్: పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు నడుం బిగించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లాకేంద్రంలోని మైసమ్మ ఆలయం, ప్రధాన రహదారి వద్ద పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ హాజరై మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో, వర్షపాతం పెరగడంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
భూపాలపల్లి అర్బన్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.అఖిల కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అదనపు జూనియర్ సివిల్ జడ్జి అఖిల మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతిఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ప్రతి వ్యక్తి తమ పుట్టినరోజు సందర్భంగా కనీసం ఒక మొక్కను నాటి, దానిని పెంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూనూరు సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సృజన కుమారి, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ శ్రీనివాస్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కంప అక్షయ, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.


