వేసవిలో పెరిగిన విద్యుత్ వినియోగం
78 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశాం..
‘గృహజ్యోతి’కి
భూపాలపల్లి: జిల్లాలో ఎండ తీవ్రతతో పాటు వడగాలులు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లను విపరీతంగా వాడుతున్నారు. జిల్లాలో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఫలితంగా గృహజ్యోతి పథకానికి కరెంట్ షాక్ తగులుతోంది. నెలవారీ బిల్లు 200 యూనిట్లు దాటడంతో ఉచిత కరెంట్ అర్హత పొందే లబ్ధిదారులు సంఖ్య జిల్లాలో ఒక్కసారిగా తగ్గిపోయింది. ఒక్క మే నెలలోనే 4,515 మంది 200 యూనిట్ల కంటే ఎక్కువగా వినియోగించారు.
పెరిగిన విద్యుత్ వినియోగం..
ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తుందా అన్నట్లుగా జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. జూన్ మొదటి వారంలోకి అడుగిడినప్పటికీ తీవ్రమైన ఎండలు ఉండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటలలోపు, సాయంత్రం 6గంటల నుంచి 8 గంటల వరకు తమ అవసరాల నిమిత్తం బయటకు వస్తున్నారు. మిగిలిన సమయం మొత్తం ఇంట్లోనే గడుపుతున్నారు. ఏసీ, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్‌లను ఎక్కువగా వాడుతుండటంతో జిల్లాలోని ప్రతీ ఇంటా గతేడాది కంటే ఈ వేసవిలో విద్యుత్ వినియోగం తీవ్రంగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా ఎన్పీడీసీఎల్ అధికారులు సైతం ముందస్తు ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు తలెత్తలేదు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయడం, డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోలేదు.
తగ్గిన గృహజ్యోతి వినియోగదారులు..
వేసవి కారణంగా గృహజ్యోతి విద్యుత్ వినియోగదారులు సైతం తగ్గారు. తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి ఒక నెలలో 200 యూనిట్లలోపు వినియోగించే వారికి గృహజ్యోతి పథకం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందజేస్తుంది. గతంలో పోలిస్తే ఈ ఎండాకాలంలో గృహజ్యోతికి అర్హులైన వారి సంఖ్య తగ్గింది. విద్యుత్‌ను ఎక్కువగా వినియోగించడం మూలంగా 201 యూనిట్ వాడిని వారికి సైతం రూ.వేయి వరకు విద్యుత్ బిల్లు వచ్చింది. జిల్లాలో గృహజ్యోతి లబ్ధిదారులు 60,599 మంది ఉండగా, గత నెలలో 4,515 మంది 200 యూనిట్ల కంటే ఎక్కువగా వినియోగించారు. దీంతో వీరు బిల్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
వడగాలులతో ఇళ్లకే
పరిమితమవుతున్న ప్రజలు
నిరంతరాయంగా ఏసీ, కూలర్లు,
ఫ్యాన్ల వాడకం
ఉచిత విద్యుత్ అర్హత కోల్పోతున్న గృహాలు
విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. ఫిబ్రవరి నుంచి మే నెల వరకు విద్యుత్ డిమాండ్ ప్రతి నెలా పెరుగుతూ వచ్చింది. అయినప్పటికీ మా అధికారులు, సిబ్బంది కృషితో వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నాం. ఇందుకోసం జిల్లాలో కొత్తగా 78 ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశాం.


