● పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం
మల్హర్(కాటారం): గతంలో ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తన పేరు ఉన్నప్పటికీ తాజా గ్రామసభలో వెల్లడించిన లబ్ధిదారుల జాబితాలో తన పేరు తొలగించారని శ్రీనివాస్‌గౌడ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో కాటారం మండలం ఉండ్రాతుపల్లి గ్రామపంచాయతీ గ్రామసభలో గందరగోళం నెలకొంది. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామసభ నిర్వహించారు. గత జాబితాలో ఇందిరమ్మ ఇల్లు ఉండి ఇప్పుడు తొలగించారని శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామసభలోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు శ్రీనివాస్‌ను అడ్డుకుని ప్రమాదం జరగకుండా కాపాడారు. మంత్రి శ్రీధర్‌బాబు, సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.
ఆయిల్‌పామ్ తోట దగ్ధం
మొగుళ్లపల్లి: అగ్ని ప్రమాదంలో ఏడెకరాల ఆయిల్‌పామ్ తోట దగ్ధమైన ఘటన మండలంలోని రంగాపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రంగాపురం గ్రామానికి చెందిన రైతు పోలినేని లింగారావుకు చెందిన ఆయిల్‌పామ్ తోటకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. గాలికి మంటలు వ్యాపించి ఏడెకరాలకు విస్తరించింది. మంటలను అదుపుచేసే పరిస్థితి లేకపోవడంతో తోటతో పాటు మామిడి చెట్లు, వ్యవసాయ క్షేత్రంలోని డ్రిప్ పైప్‌లైన్స్ ఇతర వ్యవసాయ పనిముట్లు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయని రైతు లింగారావు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.7లక్షల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు.
వేగవంతం చేయాలి
చిట్యాల: సాదాబైనామాను వేగవంతం చేయాలని భూపాలపల్లి ఆర్డీఓ హరికృష్ణ అన్నారు. గురువారం చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ సాదాబైనామాలో భూముల వివరాలు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. రైతుల భూసమస్యలను ఆలస్యం కాకుండా సిబ్బంది విచారణ చేసి వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల తహసీల్దార్లు వసంతరావు, సునీత, స్వరూపరాణి, చిట్యాల డిప్యూటీ తహసీల్దార్ అనిల్, ఆర్‌ఐ రాజేందర్ పాల్గొన్నారు.
భర్త వేధింపులతో
ఆత్మహత్య
గణపురం: భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలకేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గణపురం మండలకేంద్రానికి చెందిన కోలెపాక శంకర్(47) అదే గ్రామానికి చెందిన సొంత అక్క కూతురైన కావ్యశ్రీ(34)ని 13 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. శంకర్ రోజు మద్యం తాగి పేకాట ఆడుతూ భార్యను వేధింపులకు గురిచేశాడు. ఇదే క్రమంలో బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన కావ్యశ్రీ గురువారం తెల్లవారుజామున క్రిమి సంహారక మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అశోక్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు సివిల్ ఆస్పత్రికి తరలించారు.
ఐటీడీఏలో ఇంటర్‌కమ్ లింక్‌ఫోన్స్
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐటీడీఏలో ఇంటర్‌కమ్ లింక్‌ఫోన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి అధికారులకు, సిబ్బందికి సమాచారం ఇచ్చేందుకు లింక్ టెలిఫోన్స్ ఉపయోగపడుతాయి.


