భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు, తెలంగాణ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో విద్యార్థుల నమోదు, విద్యా ప్రమాణాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధులు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు, గ్రామస్తులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల చేరికలను పెంచాలని సూచించారు. విద్యా సూచికల్లో జిల్లా ఆశించిన స్థాయిలో లేదని అసంతప్తి వ్యక్తంచేశారు. భవిత కేంద్రాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, విద్యార్థుల నమోదు విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. కళాశాలలు, వసతి గృహాల్లో సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యార్థుల నమోదు తక్కువగా ఉండటం ఆందోళనకరమన్నారు. పాఠశాలలు, హాస్టళ్లలో తాగునీరు, సివిల్ వర్క్‌స్ వంటి సౌకర్యాలపై టీజీడబ్ల్యూఈఐడీసీ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ రూపొందించిన పోర్టల్‌ను ఆవిష్కరించారు. విద్యాశాఖకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉండేలా రూపొందించిన డీఈఓ జయశంకర్ భూపాలపల్లి.కామ్ ప్రజలకు ఉపయోగపడుతుందని తెలిపారు.
యువతకు అప్రెంటిస్ అవకాశాలు
కల్పించాలి..
జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు పరిశ్రమలు ముందుకు వచ్చి అప్రెంటిస్ అవకాశాలు కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు అప్రెంటిస్ అవకాశాల కల్పనపై పరిశ్రమలు, ఐటీఐ, పాలిటెక్నిక్, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశ్రమలు అప్రెంటిస్ నియామకాల కోసం నాట్స్ (ఎన్‌ఏటీఎస్) ఆన్‌లైన్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అప్రెంటిస్ శిక్షణ కల్పించడం ద్వారా వారి సాంకేతిక నైపుణ్యాలు మెరుగుపడి భవిష్యత్ ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని తెలిపారు. జెన్కో, ఏఎంఆర్ తాడిచర్ల వంటి పరిశ్రమలు అప్రెంటిస్ అవకాశాల కల్పనలో ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. అవసరమైన అనుమతుల కోసం తన వంతు సహకారం, సిఫారసులు అందిస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలోని అన్ని పరిశ్రమలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అప్రెంటిస్ నియామకాలలో భాగస్వాములు కావాలని, యువతకు నైపుణ్యాభివద్ధి, ఉపాధి అవకాశాల కల్పనలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకన్న, జిల్లా పరిశ్రమల అధికారి సిద్ధార్థ రెడ్డి, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్స్, పరిశ్రమల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


