భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న సంఘాలకు కార్మికులు తగిన గుణపాఠం చెప్పాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మంద నరసింహారావు, ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం టీబీజీకేఎస్ నాయకుడు దుడ్డేల సాయిలు సీఐటీయూలో చేరగా ఆయనకు కండువా కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ యాజమాన్యంతో, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్సై కార్మిక సమస్యల పరిష్కారాన్ని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. సింగరేణి జేఏసీ పిలుపునిచ్చిన సమ్మెను ఈ సంఘాలు వాయిదా వేయించి కార్మికుల పోరాటాన్ని నీరుగార్చాయని విమర్శించారు. బదిలీల పేరుతో కార్మికుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. 14 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మెడికల్ అన్‌ఫిట్ అయిన సుమారు 400 మందికి వెంటనే వీటీసీ శిక్షణ తరగతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సింగరేణి నిధులను ఇతర ప్రాంతాలకు మళ్లించడాన్ని సీఐటీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఆ నిధులను సింగరేణి ప్రాంతాల అభివృద్ధికే ఖర్చు చేయాలని కోరారు. సింగరేణి పరిరక్షణ, కొత్త గనుల ఏర్పాటు, ఉద్యోగుల భద్రత వంటి అంశాల సాధనకు అన్ని కార్మిక సంఘాలు సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు తోట రమేష్, బాబురావు, శ్రీకాంత్, దుడ్డేల సాయిలు, రాజేష్ పాల్గొన్నారు.


