కాళేశ్వరం: కాళేశ్వరాలయం ఆలయ అభివృద్ధి, పునరుద్ధరణ పనులు ఈనెల 17న ప్రారంభిస్తున్న నేపథ్యంలో దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, ఈఓ మహేష్, ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ కర్ణాటకలోని శృంగేరి పీఠానికి (నేడు) శుక్రవారం వెళ్లనున్నారు. శృంగేరి పీఠాధిపతి అనుమతులు ఇప్పటికే సూత్రపాయంగా ఇవ్వడంతో పనులు మొదలు పెట్టడానికి తేదీ ఖరారు చేసి వారి రాక కోసం ఆహ్వానానికి అధికారులు వెళుతున్నట్లు తెలిసింది. ఆలయంలో పనులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులకు దర్శనాలు భారీగా వస్తుంటారు. ఈ క్రమంలో దర్శనాలు చేసుకునేందుకు బాలాలయాన్ని ఆలయ ఆవరణ లేదా అడవిలోని ఆదిముక్తీశ్వరాలయం వద్ద ఏర్పాటు చేయడానికి ఇప్పటికే దేవాదాయశాఖ కసరత్తు చర్యలు ప్రారంభించారు. గురువారం తమిళనాడులోని శిల్పులు కాళేశ్వరం దేవస్థానం గర్భాలయంలోని జోడు లింగాల (కాలుడు,యముడు) కొలతలు తీసుకున్నారు. అదే నమూనాతో లింగాలు తయారు చేసి బాలాలయంలో ఏర్పాటు చేసి భక్తుల దర్శనాలు చేస్తారని సమాచారం. ఈ బాలాలయం ఆలయం ఆవరణలోనా.. ఆది ముక్తీశ్వరాలయంలోనా.. అనేది శృంగేరి పీఠాఽఽధిపతి ఆదేశాలతో ఏర్పాటు కానుందని తెలిసింది.


