ఐదేళ్లులో పండ్ల తోటల సాగు ఇలా..
ఏటేటా పెరుగుతున్న పండ్లతోటల సాగు
భూపాలపల్లి రూరల్: జిల్లాలో పండ్ల తోటల సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతోంది. నీటి వనరులు పుష్కలంగా ఉండటంతోపాటు ఇక్కడి నేలలు, వాతావరణ పరిస్థితులు పండ్ల తోటల సాగుకు అనుకూలంగా ఉండటంతో రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పండ్ల తోటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది.
నేలలు, వాతావరణం
అనుకూలం
పండ్లతోటలు, కూరగాయల సాగుకు ఎర్రటి, ఒండ్రుతో కూడిన ఎర్రటి నేలలు ఉండాలి. ఇలాంటి నేలలే జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో 800పైగా చెరువులు ఉన్నాయి. వీటన్నింటి ద్వారా బోరుబావుల్లో ఆశించిన స్థాయిలో నీటిమట్టం ఉంటోంది. సాధారణంగా పండ్ల తోటలను బోరుబావుల కిందే ఎక్కువగా సాగుచేస్తారు. వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు ఎంత ఉన్నా, సాయంత్రం నుంచి రాత్రి వరకు చల్లగా ఉంటుంది. శీతాకాలంలో ఎంత చలిఉన్నా.. ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవు. ఇలా జిల్లాలో నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో రైతులు పండ్ల తోటలను సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
1,148 ఎకరాల్లో సాగు..
ఏళ్ల తరబడి పత్తి, వరి, వేరుశనగ తదితర పంటలను సాగుచేస్తూ వస్తున్న రైతుల ఆలోచనా సరళిలో మార్పు వస్తోంది. ప్రధానంగా పండ్ల తోటలకు ఇక్కడి నేలలు, వాతావరణం అనుకూలంగా ఉండటం.. పండ్ల రకాన్ని బట్టి మూడేళ్ల నుంచి ఐదేళ్లపాటు మంచి నిర్వహణ పద్ధతులు అవలంబిస్తే, తోటలు బాగా వచ్చి ఆర్థికంగా లాభపడతామన్న ఆలోచనతో రైతులు పండ్ల తోటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. మామిడి, బత్తాయి, బొప్పాయి, అంజీర, జామ, డ్రాగన్ ఫ్రూట్ తదితర పండ్లతోటలు సాగు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, తోటల సాగు విస్తీర్ణం పెరగడానికి మరో కారణం కూడా ఉంది. కేంద్రం ఆధీనంలోని ఎంఐడీహెచ్ పథకంతోపాటు ఉపాధి హామీ పథకం కింద పండ్లతోటల సాగును ప్రోత్సహిస్తున్నారు. ఆయా పథకాలతో సన్న, చిన్నకారు రైతులు సైతం పండ్లతోటల సాగుపై మొగ్గుచూపుతున్నారు. ఇక ఆర్థికంగా ఉన్న రైతులు పథకాలతో సంబంధం లేకుండా సాగు చేస్తున్నారు. 2021–22లో 641 ఎకరాల్లో పండ్ల తోటలు ఉండగా.. ప్రస్తుతం ఆ విస్తీర్ణం 1,148.03 ఎకరాలకు పెరగడం గమనార్హం.
మామిడి
తోట
జిల్లాలో అనుకూలమైన నేలలతో
రైతుల మొగ్గు
రాయితీలతో ప్రోత్సహిస్తున్న
ఉద్యానశాఖ
1,148 ఎకరాలకు
పెరిగిన సాగు విస్తీర్ణం
సంవత్సరం రైతులు సాగు
(ఎకరాల్లో)
2021–22 335 641
2022–23 367 691
2023–24 370 741
2024–25 840 1,045.25
2025–26 742 1,148.03
2026–27 –– 1,205 అంచనా


