● కొరిమి రాజ్‌కుమార్
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో కారుణ్య నియామకాలు పొందిన కార్మికులకు నియమాక పత్రాలు అందించాలని లేనిపక్షంలో సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ పేర్కొన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు వెంటనే అందజేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏరియా సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జీఎం రాజేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. సింగరేణి వ్యాప్తంగా వివిధ అనారోగ్య కారణాలతో మెడికల్ అన్‌ఫిట్ పొందిన కార్మికుల పిల్లల్లో సుమారు 400 మంది డిపెండెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించి రెండేళ్లుగా నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఒక్క భూపాలపల్లి ఏరియాలోనే సుమారు 70 మంది ఉద్యోగాలు మంజూరై కూడా నియామక పత్రాలు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆయా కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. జూన్ 2న నియామక పత్రాలు అందజేస్తారని ఆశించిన కార్మికులకు నిరాశే మిగిలిందన్నారు. కార్యక్రమంలో నాయకులు మాతంగి రామచందర్, ఆసిఫ్ పాషా, శ్రీనివాస్, నూకల చంద్రమౌళి, తోట రామచందర్, రాజేందర్, గణేష్, సీపీఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్, కార్మికులు పాల్గొన్నారు.
పకృతివనం..
ప్లాస్టిక్‌మయం
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలంలోని పల్లెపకృతి వనం.. ప్లాస్టిక్‌మయమైంది. నిర్వహణ సరిగా లేకపోవడంతో మొక్కలు ఎండిపోయాయి. గ్రామానికి ముఖ ద్వారంలోనే ఉన్నా పకృతి వనాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. వేసవిలో సెలవులకు గ్రామానికి వచ్చినవారు ఈ ప్రకృతి వనాన్ని చూసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వనం మొత్తం ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లతో నిండిపోయింది. ఎటు చూసినా చెత్త మాత్రమే దర్శనమిస్తుంది. దీంతో ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ప్రకృతి వనాన్ని శుభ్రం చేయించి వినియోగంలోని తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
ఐటీడీఏ డీడీ జనార్దన్ బదిలీ
ఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలోని గిరిజన సంక్షేమ విద్యా విభాగంలో ఉప సంచాలకుడి(డీడీ)గా పనిచేస్తున్న దబ్బగట్ల జనార్దన్ బుధవారం బదిలీ అయ్యారు. మంచిర్యాల గిరిజన సంక్షేమ అధికారిగా వెళ్లారు. ఆయన స్థానంలో నాగర్‌కర్నూలు జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి ఫిరంగికి పదోన్నతి కల్పిస్తూ ఏటూరునాగారం డీడీగా బదిలీ చేశారు. అదే విధంగా ఐటీడీఏ ఇన్‌చార్జ్ ఏఓగా ఎస్డీసీ విభాగంలో డీటీగా పనిచేస్తున్న అనిల్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు.


