అవగాహనతోనే ప్రమాదాల నివారణ | - | Sakshi
Sakshi News home page

అవగాహనతోనే ప్రమాదాల నివారణ

Jun 4 2026 4:58 AM | Updated on Jun 4 2026 4:58 AM

భూపాలపల్లి అర్బన్‌: భద్రతపై అవగాహన కలిగిఉన్నప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని ఏరియా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఏరియాలోని కేటీకే–5వ గనిలో బుధవారం ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగులకు భద్రతా నిబంధనలు, పనిస్థలాల్లో పాటించాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. కార్మికులతో కలిసి రక్షణ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల భద్రత సంస్థకు అత్యంత ప్రాధాన్య అంశమని పేర్కొన్నారు. గనుల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ అప్రమత్తతతో విధులు నిర్వహించాలని సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున భద్రత విషయంలో రాజీ పడొద్దన్నారు. సంస్థ నిర్దేశించుకున్న ‘జీరో హార్మ్‌’ లక్ష్య సాధనకు యాజమాన్యం, అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) తప్పనిసరిగా వినియోగించడం, యంత్రాలు, పరికరాలను నిర్దేశిత విధానాలకు అనుగుణంగా ఉపయోగించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. పనిస్థలంలో అసురక్షిత పరిస్థితులు కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించే సంస్కృతిని పెంపొందించుకోవాలని సూచించారు. ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమం కోసం సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్‌ మాటూరి రవీందర్‌, ఏరియా ఇంజనీర్‌ రాజారావు, కేటీకే–1 గ్రూప్‌ ఏజెంట్‌ ములుకుంట్ల తిరుపతి, గని మేనేజర్‌ రమేష్‌, కార్మిక సంఘాల నాయకులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement