వెంకటాపురం(కె): మండల పరిధిలోని ఆలుబాక గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి పిడుగు పడి 35 మేకలు మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం..ఆలుబాక గ్రామానికి చెందిన మజ్జా చంద్రయ్యకు చెందిన మేకలను కాపరులు చిన్నక్క, నర్సింహారావులు మేతకు తోలుకెళ్లారు. అకాల వర్షానికి పిడుగు పడి మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. మేకల కాపరులు స్పృహ తప్పిపడిపోయారు. గమనించిన గ్రామస్తులు అక్కడకు చేరుకుని 108కు సమాచారం ఇచ్చారు. వారిని వెంకటాపురం వైద్యశాలకు తరలించి చికిత్స అందించగా వారు కోలుకున్నారు. అలాగే బర్రెబొందవ గ్రామంలో పిడుగుపడి మూడు పశువులు మృతి చెందాయి.


