కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు గ్రామ, వార్డుల సభల నిర్వహణకు షెడ్యూల్ సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి గ్రామ, వార్డు సభల నిర్వహణపై డీజీపీ సీవీ ఆనంద్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీలో సీఎస్ మాట్లాడుతూ.. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన సభలపై పలు సూచనలు చేశారు. ఈ సమావేశానికి ఐడీఓసీ నుంచి జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి
రేగొండ: రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని జిల్లా వ్యవసాయాధికారి బాపురావు అన్నారు. మంగళవారం మండలం కేంద్రంలోని రైతువేదికలో భూపాలపల్లి డివిజన్ పరిధిలోని ఏడు మండలాల విత్తనాల డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు తప్పకుండా రశీదులు ఇవ్వాలని సూచించారు. అలాగే స్టాక్ రిజిస్టర్లు అప్డెట్ చేయడంతో పాటు, ధరల పట్టికలను రోజు వారీగా నమోదు చేయాలని ఆదేశించారు. రాబోయే వానాకాలం ప్రభుత్వం సూచించిన 8 రకాల సన్నరకాలను మాత్రమే విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సహాయ వ్యవసాయ సంచాలకులు రమేష్, ఏడు మండలాల వ్యవసాయశాఖాధికారులు వాసుదేవరెడ్డి, సతీష్, సురేందర్ రెడ్డి, సారయ్య, ఐలయ్య, కల్యాణి, శ్రీనివాస్ రెడ్డి, విత్తన డీలర్లు పాల్గొన్నారు.
ఎంప్లాయ్‌మెంట్
రిజిస్ట్రేషన్ మేళా
భూపాలపల్లి అర్బన్: జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో జిల్లా ఉపాధి కల్పన, యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో నేడు (బుధవారం) ఎంప్లాయ్‌మెంట్ రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎం.మల్లయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంప్లాయిమెంట్ కార్డు కోసం గతంలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారన్నారు. నిరుద్యోగ యువతకు సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రత్యేక మేళాలో కలెక్టరేట్‌లోని ఉపాఽధి కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరింస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ విద్యార్హతల ధ్రువపత్రాలు, బయోడేటా, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు వెంట తీసుకురావాలన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు పొందాలని కోరారు. జిల్లాలోని నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
సేవా పతకానికి ఎంపిక
మహాముత్తారం: విధుల్లో అంకితభావంతో పనిచేసే వారికిచ్చే కఠిన సేవా పతకానికి మహాముత్తారం ఎస్సై మహేందర్‌కుమార్ ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటించిన కఠిన సేవా పతకాల జాబితాలో ఆయన పేరును ప్రకటించారు. ఎస్సై ఎంపికకావడంపై పలువురు అభినందనలు తెలిపారు.
చెత్తా, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు
ఏటూరునాగారం: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని ఏటూరునాగారం దక్షిణం రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్ అన్నారు. ప్రజాపాలన ప్రగతిలో ప్రణాళికలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని 163 జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న చెత్తాచెదారం, ప్లాస్టిక్ వంటి వ్యర్థాలను సిబ్బందితో కలిసి తొలగించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్‌ఓ మాట్లాడుతూ చిన్నబోయినపల్లి పల్లె ప్రకృతి వనం నుంచి అటవీశాఖ చెక్ పోస్టు వరకు చెత్తాచెదారం ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రతీ ఇంటికి ఐదు మొక్కలు పెంచాలని కోరారు. విద్యార్థులు పాఠశాలల్లో క్రీడా మైదానాల వెంట మొక్కలను పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.


