● భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి
భూపాలపల్లి అర్బన్: రాష్ట్రంలో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు రవాణా, విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో విశేష పురోగతిని సాధిస్తున్నట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం భూపాలపల్లి ఏరియాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో అంబేడ్కర్ సెంటర్‌లో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ, బోనాలు, పీరీల మధ్య ధూంధాం పాటలతో నృత్యాలు చేస్తూ జీఎం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలోనే అంబేడ్కర్ సెంటర్‌లో ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. జీఎం, అధికారులు తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూల వెసి నివాళులర్పించారు. సాయంత్రం అంబేడ్కర్ స్టేడియంలో సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించగా పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. భూపాలపల్లి ఏరియాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు రవాణా లక్ష్యం 4.25 లక్షల టన్నులు కాగా ఇప్పటివరకు 5.30 లక్షల టన్నుల రవాణా చేసి లక్ష్యాన్ని 25 శాతం అధిగమించినట్లు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ సోలార్ విద్యుత్ ఉత్పత్తిని విస్తరిస్తున్నామని, గ్రీన్ ఎనర్జీ రంగంలో సింగరేణి ముందంజలో ఉందన్నారు. భూపాలపల్లి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సింగరేణి సీఎస్‌ఆర్ నిధులతో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేవా సమితి అధ్యక్షురాలు సునీతరాజేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఓటు జీఎం కవీంద్ర, అధికారులు రవికుమార్, రాజారావు, రవీందర్, నజీర్, శ్యాసుందర్, కార్మిక సంఽఘాల నాయకులు రమేష్, మధుకర్‌రెడ్డి, ఉద్యోగులు, కార్మికులు, సేవా సభ్యులు పాల్గొన్నారు.


