ఉవ్వెత్తున లేచిన ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

ఉవ్వెత్తున లేచిన ఉద్యమం

Jun 2 2026 3:12 AM | Updated on Jun 2 2026 3:12 AM

భూపాలపల్లి: మలిదశ తెలంగాణ ఉద్యమంలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తనదైన శైలిలో అలుపెరుగని పోరాటాన్ని సాగించి, ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించింది. జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు, సింగరేణి కార్మికుల సమ్మె, రాష్ట్రం కోసం ఆత్మహత్యాయత్నాలు రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డాయి. ఎన్నో పోరాటాల అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో జిల్లాలో నాడు చేపట్టిన ఉద్యమాల వివరాలతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

రాష్ట్రం ఏర్పడే వరకు దీక్షలు..

ప్రత్యేక రాష్ట్రం కోసం మలి దశ ఉద్యమం ప్రారంభమైన తరుణంలో తెలంగాణ తొలి శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి ఈ ప్రాంతంలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన సారథ్యంలో అన్ని పార్టీలతో కలిసి జేఏసీని ఏర్పాటు చేసి భూపాలపల్లి పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో 1,540 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. రాష్ట్రంలో అత్యధిక రోజులు దీక్షలు కొనసాగించిన జాబితాలో భూపాలపల్లి సైతం నిలిచింది. ఈ కార్యక్రమాలను జేఏసీ కన్వీనర్‌ పైడిపెల్లి రమేష్‌, కో కన్వీనర్లు జోగుల సమ్మయ్య, గీస సంపత్‌ తదితరులు దిగ్విజయంగా నడిపించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాతనే ఈ దీక్షలను నిలిపివేశారు.

ఆంధ్రా పెత్తనం మాకు వద్దంటూ..

మలిదశ తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న సమయంలో 2010లో భూపాలపల్లి ఏరియాలో సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్ట్‌ 1 పనులు జరుగుతున్నాయి. ఓవర్‌ బర్డెన్‌ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్‌ ఆంధ్ర ప్రాంతానికి చెందిన అతను కావడం, బంద్‌కు పిలుపునిచ్చిన్పపటికీ పనులు కొనసాగించడంతో ఉద్యమకారులు కన్నెర్రజేశారు. ప్రాజెక్ట్‌లోని డంపర్‌లకు నిప్పటించి తగులబెట్టారు.

నలుగురు ఆత్మాహత్యాయత్నం..

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ నలుగురు ఉద్యమకారులు బలిదానానికి యత్నించారు. ముద్దమల్ల భార్గవ్‌, తాటి అశోక్‌, మద్దెల విజయ్‌, దుర్శనపెల్లి రాంగోపాల్‌రావు 2012 ఏప్రిల్‌ 9వ తేదీన భూపాలపల్లి పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది.

సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిది..

ఎన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్ర విభజన చేయకపోవడంతో తెలంగాణ జేఏసీ సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చింది. జేఏసీ పిలుపు మేరకు భూపాలపల్లి ఏరియాలోని సుమారు 7వేల మంది సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. 2011 సెప్టెంబర్‌ 13వ తేదీ నుంచి అక్టోబర్‌ 24వ తేదీ వరకు 42 రోజుల పాటు విధులకు ఒక్కరు కూడా హాజరు కాకుండా మద్దతు పలికారు. బొగ్గుగని కార్మికుల సమ్మెతో దేశం మొత్తం చీకటిమయం అయ్యే పరిస్థితి సైతం నెలకొంది. వేతనాలు రాకున్నా, అధికారుల నుంచి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ కార్మికులు సమ్మెలో పాల్గొనడం నేటికీ మరువలేని సంఘటన.

ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం

1,540 రోజుల పాటు భూపాలపల్లిలో రిలే దీక్షలు

సింగరేణి యంత్రాలను తగులబెట్టిన ఉద్యమకారులు

42 రోజులు సమ్మెలో పాల్గొన్న నల్ల సూరీలు

Advertisement
 
Advertisement
Advertisement