భూపాలపల్లి అర్బన్: ఏరియాలో మే మాసంలో లక్ష్యంలో 49శాతం మాత్రమే బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2.38 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గాను 1,16లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. జూన్ మాసంలో 2.35 లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. గైర్హాజరు శాతం తగ్గించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని, అన్ని భద్రతా నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో ఉత్పత్తి, రవాణా కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఓపెన్‌కాస్ట్ గనులు, రహదారులు, డ్రెయినేజీ, పంపింగ్ వ్యవస్థలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, రక్షణ విషయంలో రాజీ లేదని జీఎం స్పష్టం చేశారు.
అటవీశాఖ అధికారులపై దాడి?
మహాముత్తారం: అటవీ భూముల్లో పోడు వ్యవసాయం చేస్తున్నారనే సమాచారం మేరకు అక్కడకు వెళ్లిన అటవీశాఖ అధికారులపై కొంత మంది వ్యక్తులు దాడి చేసిన ఘటన మహాముత్తారం మండలంలో చోటుచేసుకుంది. ఫారేస్ట్‌రేంజ్ అధికారుల కథనం ప్రకారం.. మహాముత్తారం మండలం నిమ్మగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని అటవీ భూములో చెట్లు నరికి సాగుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం మేరకు ఆదివారం అర్ధరాత్రి అటవీశాఖ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అటవీశాఖ అధికారులను చూసిన డోజర్లతో పోడుచేసే వ్యక్తులు కర్రలు, రాళ్లతో అటవీశాఖ అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో పెగడపల్లి రేంజ్ అధికారులు శ్రీనివాస్, అఖిల్‌రెడ్డికి గాయాలయ్యాయి. వెంటనే వీరు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారి సూచనల మేరకు మహాముత్తారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఏరియా సింగరేణి ఉత్తమ ఉద్యోగుల ఎంపిక
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణి సంస్థ ప్రకటించిన ఉత్తమ ఉద్యోగుల జాబితాలో భూపాలపల్లి ఏరియాకు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఎంపికై నట్లు ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్‌సుందర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏరియా స్థాయి ఉత్తమ ఉద్యోగిగా కేటీకే–1 గని ఎస్‌డీఎల్ ఆపరేటర్ లకవత్ శంకర్ ఎంపికయ్యాడు. కంపెనీ స్థాయి ఉత్తమ ఉద్యోగిగా కేటీకే ఓసీ–2 గని ఫిట్టర్ కె.రాజయ్య ఎంపికయ్యారు. నేడు (మంగళవారం) జరిగే వేడుకల సందర్భంగా భూపాలపల్లి అంబేడ్కర్ స్టేడియంలో లకవత్ శంకర్‌ను ఏరియా జనరల్ మేనేజర్ సత్కరించనుండగా, కంపెనీ స్థాయి ఉత్తమ ఉద్యోగిగా ఎంపికై న రాజయ్యను కొత్తగూడెంలో జరిగే కార్యక్రమంలో సింగరేణి సీఎండీ సన్మానించనున్నట్లు తెలిపారు. సింగరేణి అభివృద్ధికి వారు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాలు దక్కడం గర్వకారణమని పేర్కొన్నారు. ఎంపికై న ఇద్దరు ఉద్యోగులను అధికారులు, సహోద్యోగులు అభినందించారు.
భక్తులకు మజ్జిగ పంపిణీ
వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయంలో భక్తులకు సోమవారం ఉచితంగా మజ్జిగను దాతల సహకారంతో పంపిణీ చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఇమ్మడి భాస్కర్ తెలిపారు. సరస్వతి అంత్య పుష్కరాలకు వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో రామప్పను సందర్శిస్తున్నారని తెలిపారు. భక్తులు, పర్యాటకుల కోసం ఉచితంగా మజ్జిగను అందించడం అభినందనీయమని తెలిపారు.
శంకర్ రాజయ్య


