మల్హర్(కాటారం): తనపై కాటారం ఎస్సై దాడిచేశాడంటూ బాధితుడు ఎస్సైపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. దళిత కుటుంబానికి చెందిన తనపై కాటారం ఎస్సై దాడి చేశారని కాటారం గ్రామపంచాయతీకి చెందిన రామిల్ల రాజు ఈనెల 29న జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించాడు. దీనిపై ఎస్సీ కమిషన్ స్పందించింది. 15 రోజుల్లో పూర్తి నివేదికను ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది.
ప్రమాదాలు జరిగినా
పట్టించుకోరా..?
మహాముత్తారం: మహాముత్తారం గ్రామపంచాయతీలో గడ్డం రాజయ్య ఇంటిసమీపంలోని మలుపువద్ద గతంలో సైడ్‌కాల్వ నిర్మాణం చేపట్టారు. ఆ కాల్వను పూర్తిగా నిర్మించకుండా వదిలేశారు. ప్రధాన రహదారి కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఈ కాల్వలో ద్విచక్రవాహనాలు, పశువులు పడిన ఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా స్పందించి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
బావిలో పడి మహిళ మృతి
రేగొండ: బావిలో పడి మహిళ మృతిచెందిన ఘటన రేగొండ మండలం మడతపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మోటబోతుల సులోచన (40) కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ఆమె మధ్యాహ్నం వరకు తిరిగి రాలేదు. దీంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చుట్టూ పక్కల వెతకగా గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో మృతదేహం లభ్యమైంది. మృతురాలి భర్త కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.
కాలిన ధాన్యం
చిట్యాల: గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో వరి ధాన్యం కాలిపోయిన ఘటన చిట్యాల మండలకేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలకేంద్రానికి చెందిన బొల్లెపెల్లి సాంబయ్య తన రెండు ఎకరాల పంట పొలంలో వరి పంట సాగుచేశాడు. వారం క్రితం కోయగా ధాన్యం కల్లంలోనే ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు సమీపంలో పంట పొలంలో నిప్పంటించగా కాలుకుంటూ వచ్చి సాంబయ్య పంట పొలంలోని ధాన్యానికి అంటుకుంది. దీంతో రూ.50వేల విలువైన ధాన్యం పూర్తిగా దగ్ధమైంది. పైపులు కూడా కాలిపోయాయని బాధితుడు తెలిపాడు.
కులవర్గ విభేదాలు
విస్మరించాలి
హన్మకొండ కల్చరల్ : కులవర్గ విభేదాలను విస్మరించాలని చిన్మయానంద మిషన్ ప్రధాన కార్యదర్శి శ్రీసువిరానందస్వామి ఉద్భోధించారు. ఆదివారం హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఈఓ అనిల్‌కుమార్, ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామిజీ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. చిన్మయ మిషన్ స్థాపించి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అమృతోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వీరన్న సన్నిధిలో
భక్తుల సందడి
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఆదివారం భక్తులతో సందడి నెలకొంది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా వీరభద్రస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. క్యూలో నిల్చొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.


