● ఇతర జిల్లాల కంటే సాగు జాప్యం
● అకాల వర్షాలకు దెబ్బతింటున్న పంటలు
● సాగునీరు, స్థానిక పరిస్థితులే కారణం
భూపాలపల్లి రూరల్: కాలానికి అనుగుణంగా జిల్లాలో పంటల సాగులో మారని రైతన్నకు నష్టాలు తప్పడం లేదు. ఇతర జిల్లాలతో పోలిస్తే జిల్లాలో వ్యవసాయంలో వ్యత్యాసం కనిపిస్తోంది. ములుగు, వరంగల్, పెద్దపల్లి జిల్లాలతో పోలిస్తే ఇక్కడి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. స్థానిక పరిస్థితులతో దుక్కులు దన్నడం మొదలు విత్తనం వేసి పంట చేతికొచ్చేదాకా తేడా ఉంటోంది. దీంతో యాసంగిలో అకాల వర్షాలకు చేతికొచ్చిన పంటలు నష్టపోవాల్సి వస్తోంది. మరో వారం, పది రోజుల్లోనే రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశముంది. ఈ క్రమంలో ప్రణాళిక ప్రకారం వెళ్తే నష్టాన్ని నివారించే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
నారు నుంచి కోతల దాకా..
వానాకాలం ఆరంభం జూన్ మొదటి వారంలో వరినార్లు పోస్తే అక్టోబర్ వరకు కోతలు పూర్తయ్యే అవకాశముంది. మళ్లీ నవంబర్‌లో నాట్లు వేస్తే ఏప్రిల్‌లో కోతలు పూర్తి కానున్నాయి. జిల్లాలో రైతులు జూలైలో నార్లు పోస్తూ.. ఆగస్టు, సెప్టెంబర్ వరకు నాట్లు వేస్తున్నారు. బోరు బావులు తప్పా, కుంటలు, చెరువుల్లో నీరు వచ్చే దాకా సాగుపై ధీమాలేని కారణంగానే ఈ జాప్యం జరుగుతోంది.
సాగునీటి సౌకర్యం లేక..
జిల్లాలో వేలాది ఎకరాలకు ఇప్పటికీ వర్షాధారమే దిక్కు. అందుకే రైతులు అధికంగా ఆరుతడి పంటలు వేస్తుంటారు. భారీ సాగునీటి ప్రాజెక్టు లేక చిన్న వనరులే దిక్కవుతున్నాయి. కుంటలు, చెరువులు, రిజర్వాయర్లు, పాటు బోరు బావులు కింద పంటలు సాగవుతున్నాయి. వానలు సమృద్ధిగా కురిసి నీరు చేరితే భరోసాతో రైతులు వరి వేస్తున్నారు. ఇక వానాకాలంలో ఆరుతడి పంటలైన వరి, పత్తి, కంది, పెసర పంటలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ముందుగా సాగుచేస్తేనే మేలు..
యాసంగిలో రైతులు ముందుగా సాగు చేయడంతో నష్టం తగ్గించుకోగలిగారు. జిల్లాలో గత నెలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కొన్నిచోట్ల ఇప్పటికే కొనుగోళ్లు పూర్తికావచ్చాయి. ముందుగా వరి నాట్లు వేసిన రైతులు పంట చేతికి రాగానే వెంటనే అమ్మేసుకున్నారు. ఆలస్యంగా నాట్లు వేసిన రైతులు వాతావరణంలో వస్తున్న మార్పులు, మబ్బుల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మాయిశ్చర్ రాక ఆందోళన చెందుతున్నారు.
పశువులు నష్టం చేస్తాయని..
ముందస్తుగా నార్లుపోస్తే పశువులు, మేకలు, గొర్రెలు, ఇతర జీవాల సంచారంతో రక్షణ ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో అందరూ ఒకేసారి జూలైలోనే వరినార్లు పోస్తున్నారు. ఆ సమయంలో పశువుల కాపర్లు పంట చేన్లకు వెళ్లకుండా పశువులను నిలుపుతున్నారు. స్థానికంగా ఉన్న పరిస్థితుల కారణంగానే జిల్లాలో సాగులో జాప్యం జరుగుతోంది. ఇక ప్రైవేట్‌లో కాకుండా ప్రభుత్వమే నిర్ణీత సమయంలో విత్తనాలు పంపిణీ చేస్తే కొంతవరకు సమస్య తీరే అవకాశముంది.
సాగులో 15రోజులు ముందుకెళ్లాలి..
జిల్లాలో వరికోతలు దాదాపు పూర్తయ్యాయి. కొన్నిచోట్ల అకాల వర్షాల కారణంగా ధాన్యానికి నష్టం వాటిల్లింది. వానాకాలంలో ముందుగానే సాగు పనులు ప్రారంభించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. సాగులో ఆధునిక పద్ధతులు అవలంభించాలి. జూన్ నెలలో నార్లు పోసుకోవాలి. సాగులో 15రోజులు ముందుకెళ్లాలి. అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి.
– బాబురావు, జిల్లా వ్యవసాయాధికారి
వానాకాలం సాగు అంచనా (ఎకరాల్లో)
వరి 1,09,854
పత్తి 1,06,560
పెసర 90
కంది 110


