భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్‌ప్రసాద్ తెలిపారు. శనివారం భూపాలపల్లి సింగరేణి గెస్ట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించినప్పటికీ, వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం, ఐఎన్‌టీయూసీ ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లలేకపోయాయని చెప్పారు. మెడికల్ బోర్డు పాత విధానం పునరుద్ధరణ, విజిలెన్స్ కేసుల పరిష్కారం, మారుపేరుల సమస్య, సొంత ఇంటి కల సాకారం, పెర్క్స్‌పై ఆదాయపు పన్ను భారం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఐఎన్‌టీయూసీ నాయకులు ధర్మపురి, వికాస్ యాదవ్, జోగ బుచ్చయ్య, రాజేందర్, రత్నం సమ్మిరెడ్డి, కొలిపాక నర్సింగరావు, గడిపే చక్రపాణిలు పాల్గొన్నారు.
ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల
విద్యారణ్యపురి: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలను శనివారం అధికారులు విడుదల చేశారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. టెన్త్ పరీక్షలకు 3,357 మంది విద్యార్థులు హాజరుకాగా.. అందులో 2,792 మంది (83.17 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. టెన్త్‌లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 92.09 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో రెండో స్థానాన్ని సాధించిందని ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ ఎ.సదానందం తెలిపారు. మహబూబాబాద్ జిల్లా 91.72 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానం, ములుగు జిల్లా 90.62 శాతం ఉత్తీర్ణతతో ఐదో స్థానం, హనుమకొండ జిల్లా 89.04 శాతం ఉత్తీర్ణతో ఏడో స్థానంలో నిలిచింది. హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్ విద్యార్థులను అభినందించారు.
ఇంటర్‌లో ములుగు జిల్లా
రాష్ట్రస్థాయిలో ఫస్ట్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకు 6,568 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 5,174 మంది (78.78 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ములుగు జిల్లా 81.66 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని కోఆర్డినేటర్ ఎ.సదానందం తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా 81.51 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
మొక్కజొన్న డబ్బులు
విడుదల
భూపాలపల్లి: మార్క్‌ఫెడ్ ద్వారా జిల్లాలో మొక్కజొన్న విక్రయించిన 460 మంది రైతులకు రూ.5.42 కోట్లు విడుదలయినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ శనివారం తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు చెల్లింపులు చేసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. చిట్యాలలో రూ.42,22,800, గొర్లవీడులో రూ.61,48,800, కొత్తగోరిపల్లిలో రూ.18,18,1200, మొగుళ్లపల్లిలో రూ.68,84, 400, పీఏసీఎస్ గణపురం 24,30,000, రేగొండ రూ.1,64,22,000 చెల్లింపులు రైతుల ఖాతాల్లో జమకానున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
టెన్త్, ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత వివరాలు..
జిల్లా టెన్త్ ఉత్తీర్ణత ఇంటర్ ఉత్తీర్ణత
హనుమకొండ 511 455 1,449 1,160
వరంగల్ 563 340 790 550
భూపాలపల్లి 354 326 611 498
మహబూబాబాద్ 507 465 869 687
జనగామ 740 588 1,862 1,473
ములుగు 682 618 987 806


