న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష
భూపాలపల్లి అర్బన్: అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. బార్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు సముదాయం ఎదుట నిర్వహించిన దీక్షకు సంఘీభావంగా న్యాయవాదులు స్వచ్ఛందంగా కోర్టు విధులను బహిష్కరించారు. ఇటీవల న్యాయవాదులపై జరుగుతున్న భౌతిక దాడులను ఖండిస్తూ, రక్షణ బిల్లును తక్షణమే అమలుచేయాలని కోరారు. న్యాయవాదుల ఆత్మగౌరవం, సమష్టి భద్రత, హక్కుల పరిరక్షణ కోసం ‘అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్’ను వెంటనే చట్టసభల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలబోజు శ్రీనివాసచారి, జనరల్ సెక్రటరీ శ్రవణ్‌రావు, న్యాయవాదులు మహేందర్, రవీందర్, ప్రియాంక, అక్షయ, రాజ్‌కుమార్, శివకుమార్ పాల్గొన్నారు.


