ఆరోగ్యంగా ఉంటేనే మెరుగైన సేవలు
భూపాలపల్లి: ప్రభుత్వ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ఆరోగ్య స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది నిరంతరం ప్రజలతో మమేకమై విధులు నిర్వహిస్తుంటారని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమని అన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, బరువు తదితర సాధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరీక్షల ద్వారా ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి వచ్చే నెలలో ప్రత్యేక వైద్యులతో మెగా క్యాంపు నిర్వహించి వైద్యసేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, టీజీఓ కార్యదర్శి సునిల్‌కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ మహ్మద్ సంధాని పాల్గొన్నారు.
ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళిక..
టెన్త్ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. 10వ తరగతి ఉత్తమ ఫలితాల సాధనపై విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ప్రతిభను విశ్లేషించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా గణితం, సైన్స్, ఇంగ్లిషు వంటి ప్రధాన సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు సాధిస్తున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీ పాఠశాలలో రోజువారీ పరీక్షలు, వారాంత మోడల్ పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఈఓ రాజేందర్ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


