రోజుకు రూ.300
వ్యవసాయ కూలీల కొరత
ప్రచారంతో ఉపాధి పొందుతున్న కార్యకర్తలు
భూపాలపల్లి అర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో మైలేజీ కోసం అభ్యర్థులు కార్యకర్తలకు రోజుకు రూ.300 చెల్లిస్తూ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. పొద్దున ప్రచారానికి రూ.200, సాయంత్రం ప్రచారానికి రూ.100 చెల్తిస్తున్నారు. ర్యాలీలు, రోడ్‌షోలే కాకుండా వార్డుల్లో ప్రచారానికి కూడా అభ్యర్థులు కార్యకర్తలను ఉపయోగించుకుంటున్నారు.
భారీ జనసమీకరణ కనిపించేలా..
భూపాలపల్లి మున్సిపల్‌లో అభ్యర్థులకు జనసమీకరణ కష్టంగా మారుతోంది. తమ వెంట ఎక్కువ మంది కనిపించేందుకు కార్యకర్తలను ఆశ్రయిస్తున్నారు. ఒకరిద్దరు కార్యకర్తలు వెంట ఉంటే లాభం లేదనుకుంటున్న అభ్యర్థులు భారీగా అనుచరులు, కార్యకర్తలతో ప్రచారంలోకి దిగాలని భావిస్తున్నారు. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారంలో భాగంగా తమ వెంట ఎక్కువ మంది జనాలు పాల్గొనాలని అనుకుంటున్నారు. సగటున రోజుకు రూ.300 ఇస్తామని తమ తరఫున ప్రచారంలో పాల్గొనాలని అడుగుతున్నారు. వీటితో పాటు ఉదయం టిఫిన్ల నుంచి మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం దాకా వంట ఏర్పాట్లు చేస్తున్నారు. వాటికయ్యే ఖర్చులన్నింటినీ అభ్యర్థులే చెల్లిస్తున్నారు.
ర్యాలీలకు, రోడ్‌షోలకు..
ప్రధాన నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశాలకు జనసమీకరణ చేయాల్సిన బాధ్యత ఆయా వార్డుల్లోని అభ్యర్థులపై పడింది. దీంతో ఎంతోకొంత ఇచ్చి ప్రచార సమయంలో జనాలు ఉండేలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా స్టార్ క్యాంపెయినర్లు వచ్చినప్పుడు, ఎమ్మెల్యేలు, పార్టీలకు సంబంధించిన ముఖ్యనాయకులు వచ్చినప్పుడు కార్యకర్తల వినియోగం ఎక్కువగా ఉంటుంది. రోడ్‌షోలు, బైక్ ర్యాలీలకు పెట్రోల్ ఖర్చులతో పాటు మందు, విందు ఇతరత్రా ఖర్చులను అభ్యర్థులు భరించాల్సి వస్తోంది.
ప్రచారానికి ఒకరోజు మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులందరూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో అందివచ్చిన అవకాశాన్ని కొంతమంది ఉపాధిగా మలుచుకుంటున్నారు. ప్రచారంలో పాల్గొంటే రోజుకు రూ.300 వస్తుండటంతో ఇదే లాభసాటిగా ఉందని అనుకుంటున్నారు. ఇలా కొంతమంది వ్యవసాయ కూలీలు ఉపాధి పొందుతున్నారు. మున్సిపాలిటీ విలీన గ్రామాలైన కాశింపల్లి, పుల్లూరు రామయ్యపల్లి, జంగేడు, వేశాలపల్లి గ్రామాల్లో వ్యవసాయం ఎక్కువగా ఉంది. ఇలాంటి చోట్ల యాసంగి వరి నాట్లపై, ఇతర పంటల సాగుపై కూలీల కొరత ప్రభావం కనిపిస్తోంది.
మున్సిపల్ ఎన్నికల కోసం
వాడుకుంటున్న అభ్యర్థులు
విలీన గ్రామాల్లో
యాసంగి పనులకు దెబ్బ
రోజుకు రూ.300
రోజుకు రూ.300


