
విత్తన భారం!
ఉద్యానపంటల విత్తనాలను 50శాతం రాయితీపై ఇస్తామన్న ప్రభుత్వ హామీ నీటిమూట అయ్యింది. ఏడేళ్ల కిందటి వరకు ఆర్‌కేవీవై (రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ యోజన) కింద కూరగాయల విత్తనాలను రాయితీపై అందించేవారు. ప్రస్తుతం ఈ పథకం తీగజాతి కూరగాయల సాగుకు ఏర్పాటుచేసే పందిళ్లకే పరిమితమైంది. కూరగాయలు, మిర్చి పండించే రైతుల ఆశలు ఆడియాశలయ్యాయి.
భూపాలపల్లి రూరల్: ఉద్యాన పంటలకు జిల్లాలోని నేలలు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ సాధారణ పంటలతో పాటు కూరగాయలను ఏటా రెండు సీజన్లలో విస్తారంగా పండిస్తారు. చిట్యాల, కాటారం, మల్హర్, గణపురం, రేగొండ మండలాల్లో వంకాయ, బెండ, పచ్చి మిర్చి, చిక్కుడు, క్యాలిఫ్లవర్, టమాట, బీర, సొరకాయ, బెండ, కాకర, ఉల్లి, టమాట పండిస్తారు. ఎండుమిర్చి సాగుపై ఈ ప్రాంత రైతులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. మహదేవ్‌పూర్, భూపాలపల్లి, రేగొండ, మల్హర్, గణపురం, మహాముత్తారం, చిట్యాల మండలాల్లో ఏటా దాదాపు 20వేల ఎకరాలకు పైగా ఎండుమిర్చి సాగవుతోంది.
రైతులపై ఆర్థిక భారం..
రాయితీపై కూరగాయల విత్తనాలను అందిస్తామని ప్రస్తుత సర్కారు హామీ ఇచ్చింది. అయితే గతేడాదితో పాటు ఈసారి కూడా రాయితీపై విత్తనాలు ఇవ్వలేదు. దీంతో ఉద్యాన రైతులపై ఆర్థిక భారం పడుతోంది. ప్రధానంగా కూరగాయలు సాగుచేసేది సన్న, చిన్నకారు రైతులే. ఏటా విత్తనాలకే రూ.6నుంచి రూ.8వేల వరకు వెచ్చిస్తున్నారు. రాయితీ ఉన్నప్పుడు రూ.3వేల నుంచి రూ.4వేలు మాత్రమే ఖర్చయ్యేదని రైతులు అంటున్నారు. రాయితీపై విత్తనాలు అందిస్తేనే ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంటున్నారు. ఇక ఎండు మిర్చి రైతుల పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ఏటా ధరలురాక నష్టపోతున్నారు. కంపెనీలు, రకాలను బట్టి విత్తనాలకే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. రకాలనుబట్టి కేజీ రూ.300నుంచి రూ.1,300 వరకు ఉంది. ఎకరాకు కనీసంగా 3కిలోలు కావాల్సి ఉంటుంది. కొన్ని రకాలను కంపెనీలు ప్యాకెట్ల రూపంలో ఇస్తారు. ఒక ప్యాకెట్ ధర రూ.700 నుంచి రూ.800 వరకు ఉంది. ఎకరాకు 12 ప్యాకెట్లు అవసరం ఉంటుంది. ఇలా ఉద్యాన రైతులు విత్తనాల కోసం అధికంగా వ్యయం చేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు ఎండు మిర్చి విత్తనాలకు రాయితీ అవకాశం కల్పిస్తేనే ప్రయోజనం చేకూరుతుంది.
ఎండుమిర్చి 21,305
కూరగాయలు 350
ఈ ఏడాది సాగు అంచనా (ఎకరాల్లో)
ఉద్యాన పంటల విత్తనాలకు రాయితీ ఉత్తమాటే
కూరగాయల రైతులకు అందని ప్రభుత్వ ప్రోత్సాహం
50శాతం ఇస్తామని
హామీ ఇచ్చిన సర్కార్
పందిరి సాగుకే పరిమితమైన
ఆర్‌కేవీవై పథకం
పెట్టబడులు పెరిగి ఆర్థికంగా
ఇబ్బందులు పడుతున్న రైతులు
పందిళ్లకే పరిమితం..
ఉద్యాన పంటలను ప్రోత్సహించడంలో భాగంగా కూరగాయల రైతులకు ప్రయోజనం చేకూర్చేలా అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆర్‌కేవీవై పథకానికి శ్రీకారం చుట్టాయి. ఈ పథకం ద్వారా రాయితీపై కూరగాయల విత్తనాలతో పాటు, ట్రేలు, తీగజాతి కూరగాయలకు అవసరమయ్యే పందిళ్లకు 50శాతం రాయితీ అందించేవారు. దీంతో చాలామంది రైతులు ప్రభుత్వ రాయితీని సద్వినియోగం చేసుకునేవారు. పండించిన కూరగాయలను మార్కెట్‌కు తరలించడానికి వినియోగించే ట్రేలను కూడా రాయితీపై తీసుకునేవారు. అయితే ఆర్‌కేవీవై పథకం కింద అవన్నీ 2015–16 వరకు అందించారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఈ పథకం కేవలం పందిళ్ల ఏర్పాటుకే పరిమితమైంది.

విత్తన భారం!