
అప్రమత్తంగా ఉండాలి
భూపాలపల్లి: జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయం నుంచి ఎస్పీ కిరణ్‌ఖరేతో కలిసి రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, వైద్య, విద్యుత్, వ్యవసాయ, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 72 గంటల పాటు భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్న సందర్భంగా ప్రజలు బయటికి రాకుండా ఇంటిపట్టునే ఉండేలా గ్రామాలు, మున్సిపాలిటీలో దండోరా వేయించాలని ఆదేశించారు. ఏ సమయంలోనైనా క్లౌడ్‌బరస్ట్ అయ్యే అవకాశం ఉందని అన్ని శాఖల అధికారులు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 90306 32608 కంట్రోల్ రూమ్ నంబర్‌కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చే యాలని స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎస్పీ కిరణ్‌ఖరే మాట్లాడుతూ.. అకస్మాత్తుగా వర్షం వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, 25మంది ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.
అధికారులతో కలెక్టర్ రాహుల్‌శర్మ,
ఎస్పీ కిరణ్‌ఖరే వీడియో కాన్ఫరెన్స్