
మత్స్యకారులు చెరువుల్లో వలలను ఉంచొద్దు
భూపాలపల్లి రూరల్: జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చెరువులు, కుంటల్లో వలలను ఉంచొద్దని, ఉంటే వెంటనే తొలగించాలని జిల్లా మత్స్యశాఖ అధికారి విజయ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చెరువులు, కుంటల్లో చేపల వేటకు వెళ్లొద్దని తెలిపారు. ప్రమాద సమయాల్లో సంఘాల్లో ఉన్న గజ ఈతగాళ్లకు సమాచారం ఇస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరపడవలు, తెప్పలు కలిగిఉన్న మత్స్యకారులు అత్యవసర సమయంలో సహాయ చర్యల్లో అధికారులకు సహకరించాలని కోరారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఎక్కడైనా చెరువులు, కుంటలు తెగితే స్థానిక అధికారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. భారీ వర్షాలకు సంబధించి ఎలాంటి సమాచారం, సాయం కోసమైనా కంట్రోల్ రూమ్ నంబర్ 90306 32608 ద్వారా సంప్రదించాలని కోరారు.
చిట్యాల తహసీల్దార్‌కు నోటీసులు
చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల తహసీల్దార్‌కు బుధవారం రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ నోటీసులు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని చింతకుంటరామయ్యపల్లి గ్రామానికి చెందిన ఏలేటి రాంరెడ్డి 23 ఆగస్టు, 2022 నాడు సమాచార హక్కు చట్టం కింద అతడి భూమికి సంబంధించిన విషయమై తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. దీనికి తహసీల్దార్ సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఆర్డీఓకు అప్పిల్ చేశారు. ఆర్డీఓ కూడా సరైన సమాచారం అందించలేదు. దీంతో స్థానిక తహసీల్దార్, ఆర్డీఓలపై , జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో బాధితుడికి సరైన న్యాయం జరుగకపోవడంతో రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన సమాచార హక్కు కమిషషనర్ తహసీల్దార్‌కు నోటీసులు జారీ చేశారు.
మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత
భూపాలపల్లి అర్బన్: మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత అని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వినియోగ వ్యతిరేక కార్యక్రమాన్ని ఉద్దేశించి బుధవారం ఏరియాలోని కేటీకే 8వ గనిలో కార్మికులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం కార్మికులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కవీంద్ర, జ్యోతి, ఎర్రన్న, రాజేశ్వర్, మారుతి, మురళీమోహన్, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు రమేశ్, మధుకర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఓరుగల్లు కళాశిఖరాలు పోస్టర్ ఆవిష్కరణ
భూపాలపల్లి రూరల్: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో ‘ఓరుగల్లు జానపద కళాశిఖరాలు వరంగల్ శంకర్, సారంగపాణి 2025 జానపద పురస్కారాలు’ కార్యక్రమం ఈనెల 21వ తేదీన హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో జరగనుందని జిల్లాలోని కళాకారులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం కార్యక్రమ ఇన్‌చార్జ్ గోల్కొండ బుచ్చన్న పిలుపునిచ్చారు. ఈసందర్భంగా బుధవారం కళాకారులతో కలిసి అంబేద్కర్ సెంటర్‌లో పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు అంబాల చంద్రమౌళి, సీనియర్ కళాకారులు కొలుగూరి సంజీవరావు, వెన్నెల శ్రీనాథ్, నరేశ్, రవి, ప్రవీణ్‌కుమార్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

మత్స్యకారులు చెరువుల్లో వలలను ఉంచొద్దు