
ఇంత నిర్లక్ష్యమా?
గొల్లబుద్దారం పాఠశాలల అభివృద్ధికి ప్రతిపాదనలు..
భూపాలపల్లి రూరల్: గొల్లబుద్దారం ఉన్నత, ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచించారు. మంగళవారం కురిసిన వర్షాలకు భూపాలపల్లి మండలంలోని గొల్లబుద్దారం పాఠశాల వరద ముంపునకు గురి కాగా, బుధవారం ఎమ్మెల్యే, కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి పాఠశాలను, అనంతరం చికెన్‌పల్లి గ్రామంలో నీటి మునిగిన ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చికెన్‌పల్లి గ్రామంలో ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాల ప్రత్యేక కేటగిరి కింద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు వంటమనిషి తమతో దురుసుగా వ్యవహరిస్తున్నారని, భోజనంలో నాణ్యత పాటించట్లేదని తెలు పగా వంట మనుషులను తొలగించి కొత్తవారి కి అవకాశం కల్పించాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ ఈఈ రమేశ్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈఓ రాజేందర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో నాగరాజు పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్బన్: రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోకి నీరు రావడంపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్‌శర్మ ఇంజనీరింగ్ అధికారులపై మండిపడ్డారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి ఆవరణం, పలు వార్డులలోకి వరదనీరు చేరి రోగులు ఇబ్బందిపడిన ఘటనతో బుధవారం కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి జిల్లా ప్రధాన ఆసుపత్రిని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరిశీలించారు. వైద్యారోగ్య శాఖ, ఇంజనీరింగ్ శాఖల అధికారుల నిర్లక్ష్యం వల్లే వర్షపు నీరు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఆర్‌ఎంఓ డాక్టర్ దివ్య, ఏఈ రవికిరణ్ పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత..
రేగొండ: పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం మండలంలోని తిరుమలగిరి శివారులోని బుగులోని జాతర పరిసరాలను కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవంలో భాగంగా మొక్కను నాటారు. బుగులోని జాతరలో పలు అభివృద్ధి పనులకు రూ.1.50 కోట్ల నిధులను కేటాయించనున్నట్లు తెలిపారు.
వైద్యారోగ్య, ఇంజనీరింగ్ శాఖల అధికారుల వల్లే ఆసుపత్రిలోకి వరద నీరు
భూపాలపల్లి ఎమ్మెల్యే
గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ ఆగ్రహం