
ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న మోదీ
భూపాలపల్లి రూరల్ : ప్రజాస్వామ్య విలువలను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని, బీజేపీకి ఏజెంట్‌గా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దొడ్డిదారిన దొంగ ఓట్లతో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యాడని విమర్శించారు. దేశ ప్రజలు కాంగ్రెస్‌ను కోరుకున్నారని, కానీ దొంగఓట్ల విధానంతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలపై మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ప్రశ్నించిన వారిపై బీజేపీ కనుసన్నల్లో ఈడీ, ఐటీ సంస్థలు దాడులతో బెదిరిస్తోందని పేర్కొన్నారు. అనంతరం జయశంకర్ ఉద్యాన వనాన్ని సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా పార్క్‌లో కలియ తిరిగారు. జిమ్ పరికరాల రిపేర్, సైడ్ డ్రెయినేజీ పైకప్పు పూర్తిగా నిర్మించాలని ఆదేశించారు. లైటింగ్, ఫౌంటెన్‌ను వెంటనే అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురావాలి అధికారులకు ఆయన సూచించారు.
దొంగతనాలపై ఎమ్మెల్యే ఆరా..
భూపాలపల్లిలోని లక్ష్మీనగర్ కాలనీల్లో శనివారం రాత్రి దొంగతనాలు జరిగిన వారి ఇళ్లకు ఎమ్మెల్యే సత్యనారాయణరావు వెళ్లి బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 9మంది ఇళ్లలో దొంగతనాలు జరగడం చాలా బాధాకరమని అన్నారు. ప్రజల భద్రతకు పోలీసులు మరింత కట్టుదిట్టమైన పహారా, సీసీ కెమెరాల ఏర్పాటు, రాత్రివేళ పెట్రోలింగ్ వంటి చర్యలు వెంటనే చేపట్టాలని ఆయన కోరారు. ఇలాంటి ఘటనలు మళ్లీ కాకుండా చూడాలని పోలీస్ అధికారులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్, నాయకులు బుర్ర కొమురయ్య, అంబాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, దాట్ల శ్రీనివాస్, ముంజాల రవీందర్ గౌడ్, తోట రంజిత్, మహేందర్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు