జనగామ రూరల్: జిల్లాలోని 8 తెలంగాణ మోడల్ పాఠశాలల్లో 32 పోస్టులకు, ప్రభుత్వ వైద్య కళాశాలలో 11 ఖాళీగా ఉన్న ఔట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 43 పోస్టుల భర్తీకి 1,533 దరఖాస్తులు రాగా 1,298 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 235 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మోడల్ పాఠశాలల్లో 32 పోస్టులకు గాను 686 దరఖాస్తులు రాగా 574 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో మొత్తం 11 పోస్టులకు సంబంధించి 847 దరఖాస్తులు రాగా 724 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్, జిల్లా ఉపాధి అధికారి కుమారస్వామి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నిబంధనలు విస్మరిస్తే చర్యలు
● జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని
దేవరుప్పుల: ఎరువుల దుకాణదారులు నిబంధనలను విస్మరిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని హెచ్చరించారు. శనివారం మండలకేంద్రంతోపాటు కోలుకొండ, చౌడూరు, కడవెండి, ధర్మాపురం గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాముల్లో నిర్దేశిత యూరియా, డీఏపీ స్టాకులను పరిశీలించి రికార్డులను సరిచూశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు ఎల్‌నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే అవకాశం ఉన్నందున అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. మండల వ్యవసాయ అధికారి మ నోహిత్ విక్రమ్‌రావు, ఏఈఓలు పాల్గొన్నారు.
ప్రతీ ఇంటా ఆనందాల వెలుగులు నిండాలి
● దీపావళి శుభాకాంక్షలు తెలిపిన
ఎమ్మెల్యేలు పల్లా, కడియం
జనగామ/స్టేషన్‌ఘన్‌పూర్: దీపావళి పర్వదినం ప్రతీ ఇంటా ఆనందాల వెలుగులు నిండాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు వేర్వేరు ప్రకటనలో తెలిపారు. ఈ పండుగ ప్రతీఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు.
ఎంజీఎంకు నలుగురు
అదనపు ఆర్‌ఎంఓలు
● కేఎంసీకి నలుగురు సివిల్
అసిస్టింట్ సర్జన్లు
● నెరవేరిన డీఎంఈ డాక్టర్ వాణి హామీ
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి నలుగురు అదనపు ఆర్‌ఎంఓలు రానున్నారు. అలాగే, కాకతీయ వైద్యకళాశాలకు కూడా నలుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్ల (మెడికల్)ను ఎంపిక చేశారు. ఎంజీఎంకు అదనపు ఆర్‌ఎంఓలతోపాటు వైద్యుల కొరత లేకుండా చూస్తామని ఇటీవల డీఎంఈ డాక్టర్ వాణి ఇచ్చిన హామీ నెరవేరడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 31న కాంట్రాక్టు పద్ధతిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకం కోసం కేఎంసీలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, మరో నలుగురు ఆర్‌ఎంఓలను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో కేఎంసీ అనాటమీకి ఇద్దరు, ఎస్‌పీఎం (కమ్యూనిటీ మెడిసిన్)కు మరో ఇద్దరిని కేటాయించారు. దీంతో ముగ్గురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు జాయిన్ కాగా మరొకరు సోమవారం జాయిన్ కానున్నారు. అలాగే, ఎంజీఎం నలుగురు అదనపు ఆర్‌ఎంఓలు కేటాయించగా ఇద్దరు జాయిన్ అయ్యారు. మరో ఇద్దరు సోమవారం విధుల్లో చేరనున్నట్లు తెలుస్తోంది.


