● స్వగ్రామాలకు చేరుకున్న వలస కుటుంబాలు
● కొనుగోలుదారులతో కిక్కిరిసిన రహదారులు
● పూలు, పూజ సామగ్రికి డిమాండ్
జనగామ: జిల్లావ్యాప్తంగా దీపావళి పండుగ సందడి నెలకొంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఇళ్లన్నీ విద్యుత్ దీపాల వెలుగులతో దేదీప్యమానంగా మెరిసిపోతున్నాయి. పండుగను పురస్కరించుకుని టపాసుల అమ్మకాలు జోరందుకోగా, పూజా సామగ్రి, పూలు, అలంకరణ వస్తువుల కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. నేడు (ఆదివారం) దీపావళి పండుగ సందర్భంగా తెల్లవారు జామున హారతులు ఇచ్చేందుకు, కేదారేశ్వర నోములు ఆచరించేందుకు కుటుంబాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మరోవైపు వలస వెళ్లిన కుటుంబాలు పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి.
బస్సుల కోసం పరుగులు
విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు కుటుంబాలతో కలిసి సొంతూళ్లకు వస్తుండటంతో జనగామ బస్టాండ్‌తో పాటు జిల్లాలోని ప్రధాన బస్టాపులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. జనగామ బస్టాండ్‌లో బస్సు ప్లాట్ ఫారంపైకి చేరుకోగానే సీట్లు దక్కించుకునేందుకు ప్రయాణికులు పోటీ పడుతున్నారు.
నేడు కేదారేశ్వర నోములు, లక్ష్మీపూజ


